Earthquake : తైవాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. జపాన్ సహా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు

తైవాన్ లో సంభవించిన భూకంపం గత 25ఏళ్లలో దేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన భూకంపంగా ..

Earthquake : తైవాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. జపాన్ సహా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు

Taiwan Earthquake

Earthquake Taiwan :  తైవాన్ భారీ భూకంపంతో వణికిపోయింది. పెద్దెత్తున్న భవనాలు ధ్వసమయ్యాయి. ఐదంతస్తుల భవనం 45 డిగ్రీ కోణంలో ఒరిగిపోయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. భూకంపం కారణంగా ఒకరు మరణించగా.. యాబై మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తైవాన్ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ భూకంపం రావడంతో పెద్దపెద్ద భవనాలు ఊగిపోయాయి. భవనాల్లో చాలా మంది చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు స్థానిక ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని తైఫీలో అనేక భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంపం కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించింది. బుధవారం ఉదయం 8గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. భూకంపం దాటికి తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Tirupati Earthquake : తిరుపతి జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.9గా నమోదు!

తైవాన్ లో భారీ భూకంపం కారణంగా సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హుహలియెన్ పట్టణాన్ని తాకాయి. ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని జపాన్ హెచ్చరించింది. భూకంపం కారణంగా తైవాన్ లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపం కారణంగా అనేక చారిత్రక వారసత్వ కట్టడాలు దెబ్బతిన్నాయి. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నిర్మించిన పాఠశాల కూడా పూర్తిగా ధ్వంసమైంది. జపాన్ లో అతిపెద్ద విమానయాన సంస్థ జపాన్ ఎయిర్ లైన్స్, ఒకినావా, కగోషిమా ప్రాంతాల నుంచి అన్ని విమాన సేవలను నిలిపివేసింది. దీంతో పాటు సుమామీ ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీస్సులను దారి మళ్లించారు. అన్ని విమానాలను దారి మళ్లించామని ఒకినావాలోని నహా విమానాశ్రయం ప్రతినిధి తెలిపారు. మరోవైపు చైనాలోని ఆగ్నేయ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

 

25ఏళ్లలో అతి పెద్ద భూకంపం..
తైవాన్ లో సంభవించిన భూకంపం గత 25ఏళ్లలో దేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన భూకంపంగా అక్కడి అధికారులు తెలిపారు. 1999లో తైవాన్ లోని నోంటు కౌంటీలో భూకంపం సంభవించింది. ఇందులో 2,500 మందికిపైగా మరణించగా.. 1300 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం సంభవించిన భూకంపం వల్ల భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.