Afghanistan : అప్ఘానిస్తాన్ లో మీడియా స్వేచ్ఛ..ఆశ్చర్యంగా ఉందన్న టోలో న్యూస్ ఓనర్!
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్...త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైన క్రమంలో అక్కడి మీడియా స్వేచ్ఛపై అందరిలో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి.

Afghan (5)
Afghanistan అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్…త్వరలో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమైన క్రమంలో అక్కడి మీడియా స్వేచ్ఛపై అందరిలో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. తాలిబన్ పాలనలో స్వతంత్ర మీడియా సంస్థలు ఎంతమేరకు మనుగడ సాగించగలవన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే మీడియా స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని తాలిబన్ ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించినా, గత అనుభవాల దృష్ట్యా మీడియా సంస్థల్లో నమ్మకం కలగడంలేదు. ఈ అంశంపై అఫ్ఘనిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్ వర్క్ మరియు దేశపు మొదటి ఇండిపెండెంట్ న్యూస్ ఛానల్ “టోలో న్యూస్” అధినేత సాద్ మొహ్సేనీ స్పందించారు.
భారత్ కి చెందిన ప్రముఖ ఇంగ్లీఫ్ ఛానల్ కి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో సాద్ మొహ్సేనీ మాట్లాడుతూ…రాజధాని కాబూల్‌ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుని వారం రోజులు దాటిందని..అయితే కాబూల్‌లోని తమ న్యూస్ ఛానల్ ఇప్పటికీ ప్రసారమవుతుండటం ఆశ్చర్యంగా ఉందని టోలో న్యూస్ యజమాని సాద్ మొహ్సేని తెలిపారు. ప్రస్తుతం తాము అనుభవిస్తున్న మీడియా స్వేచ్ఛ ఎంతకాలమన్నది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో మీడియా సంస్థలతో, పాత్రికేయులతో వారు ఎలా నడుచుకుంటారన్న దానిపై స్పష్టత లేదన్నారు.
గత వారం ప్రభుత్వ రేడియో టెలివిజన్ ప్రెజెంటర్ సహర్ నాసరి ఓ స్టోరీ చేయడానికి ప్రయత్నించగా తాలిబన్లు అడ్డుకుని కెమెరా లాక్కొని సహచరుడ్ని కొట్టినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఒక జర్నలిస్ట్ బంధువును తాలిబన్లు కాల్చి చంపారని, రెండో వ్యక్తి వెంటపడగా అతడు తీవ్రంగా గాయపడినటువంటి ఘటనల నేపథ్యంలో మీడియాకు స్వేచ్ఛనిస్తామంటున్న తాలిబన్ల మాటను పరిగణనలోకి తీసుకోలేమని సాద్ తెలిపారు. షరియా చట్టానికి అనుగుణంగా, జాతీయ భద్రతను ప్రతికూలంగా ప్రభావితం చేయకూడని విధంగా కంటెంట్ ఉండాలని మీడియా సంస్థలను తాలిబన్ హెచ్చరించిందని, ఇవి ఆందోళనలను పెంచే షరతులని ఆయన అన్నారు.
రాజధాని కాబూల్ ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లు టోలో న్యూస్ చానల్ కార్యాలయాన్ని సందర్శించారని సాద్ మొహ్సేనీ తెలిపారు. తాలిబన్లు తమ చానల్ కార్యాలయానికి వస్తారని ఏమాత్రం ఊహించలేకపోయామని..అయితే టోలో న్యూస్ కార్యాలయాన్ని తాలిబన్లు సందర్శించి చాలా గౌరవంగా వ్యవహరించి తమను ఆశ్చర్యపరిచారని సాద్ చెప్పారు. అయితే చానల్ భద్రతా సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలను మాత్రం వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇక, మహిళలు పని చేయవచ్చన్న తాలిబన్లు.. ఆ మాటకు కట్టుబడలేదని సౌద్ చెప్పారు. టోలో న్యూస్ ఛానల్ మహిళా జర్నలిస్ట్ షబ్నం దావ్రాన్‌ను కార్యాలయం వద్ద తాలిబన్లు అడ్డుకుని వెనక్కి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటన అనంతరం టోలో న్యూస్‌లోని 20 శాతం మహిళా యాంకర్లు తమ ఉద్యోగాన్ని వదులుకోవడం లేదా దేశాన్ని విడిచి ఉంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు.
అయితే తమ పని తాము చేస్తూనే ఉంటామని, అఫ్ఘానిస్తాన్ లోపలా లేదా బయట, లేదా రెండు చోట్లా అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని సాద్ తెలిపారు. తాము గత 20 ఏళ్లుగా అఫ్ఘాన్లకు సమాచారాన్ని అందించడానికి, ప్రజలకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయడానికి పని చేశామని, దీనిని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని సాద్ సృష్టం చేశారు.