టెన్షన్ టెన్షన్ : ఎల్వోసీ వైపు తరలి వెళుతున్న పాక్ ఆర్మీ

ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేక పోతోంది. ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఉందని తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ మంగళవారం ఇందుకు సంబంధించి ఓ స్టోరీ ప్లే చేసింది. బలోచిస్తాన్, గిరిజన ప్రాంతాలను వదిలిపెట్టి పాక్ దళాలు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వైపు వెళుతున్నట్లు ఆ కధనంలో పేర్కోన్నారు. పాకిస్తాన్‌లోని ఉత్తర వజిరిస్తాన్, బన్ను, జానిఖేల్ ప్రాంతాల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో సైనిక బలగాలు ఎల్వోసీ కి బయల్దేరాయి. సైనిక అవసరాలకు కావాల్సిన వస్తువులను తరలించేందుకు ట్రక్కులు, బస్సులు, ప్యాసెంజర్ బస్సులను పాక్ సైన్యం ఉపయోగిస్తోంది. కాగా ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయనీ, తమకు సహకరించాలని పేర్కొంటూ జానిఖేల్, ఉత్తర వజిరిస్తాన్ ప్రాంతాల్లోని యువకులు, గిరిజనులను పాక్ ఆర్మీ కోరినప్పటికీ వారు తిరస్కరించినట్టు రిపబ్లిక్ టీవీ స్టోరీ లో చెప్పింది. మరోవైపు జనరల్ ఖమర్ జావేద్ భజ్వా సారథ్యంలోని పాక్ సైన్యం తాలిబన్లతో కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
పాకిస్తాన్‌లో తీవ్రవాదాన్ని పెంచి పోషించడం వల్లే శాంతికి విఘాతం కలుగుతోందంటూ భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా మూడు పొరుగు దేశాల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తున్నా పాక్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనించదగ్గ విషయం. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో పాటు పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్, పస్తూన్ గిరిజన తెగల నుంచి భారత్‌కు పెద్దఎత్తున మద్దతు, సంఘీభావం లభించింది. పీఓకే లోని జనావాసాల జోలికి వెళ్లకుండా కేవలం ఉగ్రమూకలనే భారత్ టార్గెట్ చేసినప్పటికీ పాకిస్తాన్ భారత్‌పైకి యుద్ధ విమానాలను పంపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.