ఏం జరుగుతుందో చూడాలి…భారత్-చైనా సరిహద్దు టెన్షన్ పై ట్రంప్

చైనా-భారత్ ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి భారత్, చైనా దేశాలతో మాట్లాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్- చైనా సరిహద్దు మధ్య సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని ట్రంప్ అన్నారు. దీన్ని చాలా పెద్ద సమస్యగా అభివర్ణించిన ట్రంప్…సరిహద్దులో ఘర్షణలు తగ్గించేందుకు ఇటు భారత్‌తోపాటు అటు చైనాతో కూడా మాట్లాడుతున్నామని తెలిపారు.
కరోనా వైరస్ సంక్షోభం తర్వాత శనివారం తొలిసారిగా ఓక్లహోమాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో ఆయన వైట్‌హౌస్ దగ్గర మీడియాతో మాట్లాడారు. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని, వారు కొట్టుకున్నారని, మున్ముందు ఏం జరుగుతుందో చూడాలని ట్రంప్ అన్నారు. ఈ సమస్య నుంచి బయటడపడేందుకు అమెరికా తనవంతు సాయం చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
సోమవారం(జూన్-15,2020)రాత్రి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నతూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులు ముఖాముఖి తలపడటం తెల్సిందే. కొంత కాలంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు ఆడుతున్న ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ దొంగదెబ్బ తీయాలని అదునుచూసి ఘర్షణకు దిగింది. దాడికి ఎలాంటి ప్రణాళిలకు లేకపోయినప్పటికీ.. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరవీరులవగా,40మందికి పైగా చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం.