ట్రంప్ అజాగ్రత్త 48వేల ప్రాణాలను బలిగొంది: సినీ నిర్మాత

  • Published By: Subhan ,Published On : May 12, 2020 / 06:57 AM IST
ట్రంప్ అజాగ్రత్త 48వేల ప్రాణాలను బలిగొంది: సినీ నిర్మాత

Updated On : May 12, 2020 / 6:57 AM IST

కరోనా వైరస్ గురించి నిర్లక్ష్యం వహించాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు మరోసారి ఊపందుకున్నాయి. ఓ వైపు ట్రంప్.. ఇది ముమ్మాటికి చైనా పనే అని చెప్పుకొస్తుంటే స్వదేశంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వేదికగా బోర్డు మీద రాసి మరీ విమర్శలు ఎక్కుపెట్టారు. 

‘ట్రంప్‌ డెత్‌ క్లాక్‌’ పేరుతో ఒక బోర్డు వెలిసింది. ట్రంప్ సరైన సమయంలో అలర్ట్ అయి చర్యలు తీసుకొని ఉంటే కొందరి ప్రాణాలు అయినా కాపాడుకోగలిగే వాళ్లమని ఆ నెంబరును దాని మీద ప్రదర్శించారు. ఆ బిల్‌బోర్డు పెట్టింది ఎవరో కాదు.. న్యూయార్క్‌కు చెందిన సినీనిర్మాత యూజీన్‌ జారెకి.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 80వేలకు పైగా మృతి చెందారు. ట్రంప్‌ యంత్రాంగం సరైన సమయంలో స్పందించి ఉంటే 48వేలకు పైగా మరణాలను అరికట్టడం కుదిరేదట. వారం రోజులు ముందుగా అంటే మార్చి 16న తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్చి 9 నుంచే తీసుకుని.. సామాజిక దూరం, పాఠశాలల మూసివేత వంటి కఠిన నిబంధనలు అమలు చేసుంటే మరణాలు సంభవించేవే కాదని డెత్ క్లాక్‌లో రాయించారు. 

ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాఖ్యల ఆధారంగా నిపుణులు వేసిన లెక్కల ప్రకారం.. అరికట్టగల మరణాలు 60 శాతంగా ఉన్నాయన్నారు. ‘ముందుగానే నిబంధనలను అమలు చేసుంటే, మరింత మందిని కాపాడగలిగేవాళ్లమని ఫౌచీ గతంలోనే అన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ట్రంప్‌లా కాకుండా మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నామంటూ క్లాక్‌ మీద రాసుకొచ్చాడు ఆ నిర్మాత.

‘యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల సేవలకు గుర్తుగా పేర్లను స్మారకాల మీద రాసినట్లుగా, ట్రంప్‌ యంత్రాంగం ఆలస్యంగా స్పందించిందని అన్నారు. కోల్పోయిన ప్రాణాల సంఖ్యను ప్రజలకు వెల్లడించడం ఇప్పుడు అత్యవసరం’ అంటూ ఆ బోర్డు మీద ప్రస్తావించారు.