‘గోల్డ్‌ కార్డ్‌’ తీసుకుంటే మీకు అమెరికాలో ఏమేం దక్కుతాయంటే?

ఈబీ-5తో పోల్చితే గోల్డ్‌ కార్డ్‌లోని స్టాండర్డ్స్‌ సులభతరంగా ఉన్నాయి.

‘గోల్డ్‌ కార్డ్‌’ తీసుకుంటే మీకు అమెరికాలో ఏమేం దక్కుతాయంటే?

Trump Gold Card

Updated On : December 11, 2025 / 4:39 PM IST

Gold Card: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నుంచి “గోల్డ్‌ కార్డ్‌” విక్రయాలను ప్రారంభించారు. విదేశీయులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తే వారికి యూఎస్‌లో ఉండేందుకు చట్టబద్ధ హోదా కల్పించడం, ఆ తర్వాత అమెరికా పౌరసత్వం పొందే అవకాశం కల్పించే పథకం ఇది.

సుమారు మూడు దశాబ్దాలపాటు ఉన్న పాత ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన పథకమే “గోల్డ్‌ కార్డ్‌”. ఈ కార్డు తీసుకోవాలనుకున్న వ్యక్తి ఒక మిలియన్ డాలర్లను (బేస్‌ వెర్షన్) చెల్లించాలి. లేదంటే అతడు పనిచేస్తున్న కంపెనీ 2 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. (Gold Card)

ట్రంప్ ఈ గోల్డ్‌ కార్డ్‌ను ప్రపంచంలోని టాలెంట్‌ ఉన్న వ్యక్తులను ఆకర్షించేదిగా పేర్కొన్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి చదువు పూర్తి చేసుకున్న ప్రతిభావంతులను తమ దేశంలోనే ఉండేలా చేయవచ్చని అన్నారు. అలాగే, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా ఉంటుందని తెలిపారు.

ట్రంప్ ఇప్పటికే అమెరికాలో వలసల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. చట్టవ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వారిని పంపించేయడం, సరిహద్దు నియంత్రణలు కఠినతరం చేయడం వంటివాటిని అమలు చేస్తూనే.. అసాధారణ ప్రతిభ ఉన్న విదేశీయులు మాత్రం అమెరికాలో ఉండాలని ట్రంప్ అనేకసార్లు చెప్పారు.

“అమెరికా ప్రభుత్వ ట్రంప్ గోల్డ్‌ కార్డ్ అందుబాటులో ఉంది. అర్హత ఉండే ప్రతి వ్యక్తి నేరుగా పౌరసత్వం తీసుకోవడానికి ఉన్న మార్గం ఇది. మా అమెరికన్ కంపెనీలు తమ వద్ద ఉన్న నైపుణ్యాలు కలిగిన వారిని దూరం చేసుకోకుండా ఇది ఉపయోగపడుతుంది” అని ట్రంప్ తెలిపారు.

గోల్డ్‌ కార్డ్‌తో దక్కేవి ఇవే..
చట్టబద్ధంగా అమెరికాలో ఉండేందుకు వేగవంతంగా ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం దక్కుతుంది. ఇది పేరుకే గోల్డ్‌ కార్డ్ అయినప్పటికీ ఇది పునర్వ్యవస్థీకరించిన గ్రీన్ కార్డ్ అని చెప్పవచ్చు. అయితే ట్రంప్ దీనిని “మరింత మెరుగైనది”గా, “మరింత శక్తిమంతమైన మార్గం”గా పేర్కొన్నారు.

గోల్డ్‌ కార్డ్ తీసుకుంటే శాశ్వత చట్టబద్ధ నివాసం పొందుతారు. అంటే ఎప్పటికీ అమెరికాలోనే నివసిస్తూ అక్కడే పనిచేసుకోవచ్చు. త్వరగానే అమెరికా పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ఈబీ-5తో పోల్చితే గోల్డ్‌ కార్డ్‌లోని స్టాండర్డ్స్‌ సులభతరంగా ఉన్నాయి. గ్రీన్ కార్డులు స్పాన్సర్‌షిప్, లాటరీలు, లేదా ఈబీ-5 పెట్టుబడుల వంటి అనేక మార్గాల్లో లభిస్తాయి. ఈబీ-5లో కనీస పెట్టుబడి 800,000 డాలర్లు, అలాగే, ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది.

Election Commission: మీ ఓటును ఇంకెవరో వేస్తే టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి..

గోల్డ్ కార్డు పొందాలంటే 5 మిలియన్ డాలర్లు నేరుగా చెల్లించాలి. కొన్ని సందర్భాల్లో ఒక మిలియన్‌ డాలర్లతో ఉండే ప్రాథమిక వెర్షన్ కూడా ఉందని చెబుతారు. ఈ చెల్లింపు వల్ల సాధారణంగా ఉండే సుదీర్ఘ వీసా జారీ ప్రక్రియలు లేకుండా, చాలా వేగంగా ఆమోదం పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు.

అంటే, 5 మిలియన్ డాలర్లను నేరుగా చెల్లిస్తే, సాధారణ వీసా పద్ధతులు, అర్హతలు, క్యూలను దాటేసి, త్వరగా శాశ్వత నివాస హోదా లభిస్తుంది.

గోల్డ్ కార్డ్ ప్రోగ్రాంకి అర్హత సాధిస్తే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ నిర్ణయంతో ఈబీ-1 లేదా ఈబీ-2 వీసా కేటగిరీల్లో చట్టబద్ధ శాశ్వత నివాస హోదా లభిస్తుంది.

నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు
అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న అత్యధిక నైపుణ్యంతో ఉన్న గ్రాడ్యుయేట్లను తమ దేశంలో నిలుపుకోవడమే ప్రధాన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నారు. ముఖ్యంగా చైనా, ఇండియా, ఫ్రాన్స్ నుంచి వచ్చిన వారిని.

“నైపుణ్యం ఉన్నవారు అమెరికాలో కాలేజీ చదువులు పూర్తి చేసి ఇండియా, చైనా, ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు” అని ట్రంప్ కార్డు విడుదల సందర్భంగా చెప్పారు.

ఈబీ-5 వ్యవస్థతో పోల్చితే గోల్డ్ కార్డు తీసుకునేవారికి అమెరికాలో ఉద్యోగాలు సృష్టించాలనే షరతు కూడా లేదు. ట్రంప్ ప్రకటనలో వార్షిక పరిమితులు లేదా అందుబాటులో ఉన్న కార్డుల సంఖ్యపై ప్రస్తావన కూడా లేదు.

ఎక్కువమంది విదేశీ గ్రాడ్యుయేట్లను తమ సంస్థలోనే ఉండేలా చేసుకోవాలనుకునే కంపెనీలు మిలియన్ డాలర్లు చెల్లించాల్సి రావచ్చు.

గోల్డ్‌ కార్డ్‌ కోసం చెల్లింపులు ఇలా..

ఒక మిలియన్ డాలర్ల చెల్లింపు అనేది ప్రాథమిక లేదా తగ్గించిన వెర్షన్‌గా చెప్పే తక్కువ స్థాయి చెల్లింపు.

2 మిలియన్ డాలర్లు అనేది పాత ఇన్వెస్టర్ వీసా మోడల్‌లో (ప్రత్యేకించి కంపెనీల ద్వారా) అవసరమైన పెట్టుబడి స్థాయి.

5 మిలియన్ డాలర్లు అనేది కొత్త గోల్డ్ కార్డ్‌కి ప్రధానంగా నేరుగా చెల్లింపులు చేసే విధానం. సంప్రదాయంగా ఉన్న వీసా జారీ ప్రక్రియలు లేకుండా వేగంగా ఆమోదం పొందేందుకు ఇంత చెల్లించాలి.