విషం చిమ్ముతున్న చైనాకి దిమ్మతిరిగే షాక్ : 2లక్షల అకౌంట్లు సస్పెండ్

  • Published By: Mahesh ,Published On : August 21, 2019 / 02:40 PM IST
విషం చిమ్ముతున్న చైనాకి దిమ్మతిరిగే షాక్ : 2లక్షల అకౌంట్లు సస్పెండ్

Updated On : August 21, 2019 / 2:40 PM IST

విషం చిమ్ముతున్న చైనాకి ట్విట్టర్ గట్టి షాక్ ఇచ్చింది. ఒకేసారి 2లక్షల అకౌంట్లు సప్పెండ్ చేసింది. హాంకాంగ్ ఉద్యమకారులపై ఉగ్రవాదులుగా ముద్ర వేస్తూ చైనా ట్వీట్స్ చేసింది. దీంతో ట్విట్టర్ యాజమాన్యం చైనాపై కొరడా ఝళిపించింది. హాంకాంగ్ లో నేరస్తులను చైనాకు తరలించే చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్ పౌరులు కొద్దిరోజులుగా ఉద్యమిస్తున్నారు. దీంతో ఇటు హాంకాంగ్ పోలీసులు, అటు ఆందోళనకారులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. హాంకాంగ్ వాసులకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలుపుతుంటే చైనాకి చెందిన వారు మాత్రం వారిని ఉగ్రవాదులుగా ముద్రవేస్తున్నారు.

తాజాగా ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లపై ట్విట్టర్ కొరడా ఝుళిపించింది. చైనా ప్రభుత్వ ప్రోద్బలంతో విషం చిమ్ముతున్న 2లక్షల ట్విట్టర్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. అలాగే చైనా ప్రభుత్వం మద్దతున్న మీడియా కంపెనీల నుంచి ప్రకటనలను కూడా నిషేధిస్తామని ప్రకటించింది. తమ గైడ్ లైన్స్ ను ఉల్లంఘించినందునే చైనాకు చెందిన 2 లక్షల ట్విట్టర్ ఖాతాలను రద్దు చేశామని కంపెనీ వివరణ ఇచ్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో తాము ఇప్పటికే రెండు రష్యన్ మీడియా కంపెనీలపై నిషేధం విధించామని, పలు ఖాతాలను సస్పెండ్ చేశామని ట్విట్టర్ గుర్తు చేసింది. తప్పు చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. విద్వేషం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని చెప్పింది.

ట్విట్టర్ చర్యతో హాంకాంగ్ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైనాకి బుద్ధి చెప్పారని ప్రశంసిస్తున్నారు. ఇది మంచి పరిణామం అన్నారు. తాము న్యాయం కోసం పోరాటం చేస్తుంటే.. ఉగ్రవాదులుగా ముద్ర వేయడం కరెక్ట్ కాదన్నారు. చైనాకి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు వెల్లడించారు.

హై అలర్ట్ : రాష్ట్రంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు