వారి వీసా మరో ఏడాది పొడిగింపు

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ యునైటెడ్ కింగ్‌డం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అరికట్టే చర్యల్లో భాగంగా.. UK లో సేవలు అందిస్తున్న విదేశీ డాక్టర్లు, నర్సుల వీసా కాల పరిమితిని ఒక ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూకే హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మంగళవారం ధ్రువీకరించారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగస్వామ్యమైనందుకు గానూ వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆమె పేర్కోంది.
తద్వారా దాదాపు 2800 మంది వలస జీవులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ క్రమంలో భారత్ తో సహా ఇతర దేశాల నుంచి వచ్చి UK లో నివాసం ఉంటున్న వైద్య సిబ్బందికి ఊరట లభించింది. అక్టోబరులో వీసా గడువు ముగిసే డాక్టర్లు మరో ఏడాది పాటు అక్కడే ఉండే అవకాశం లభించింది.
‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి జాతీయ ఆరోగ్య సేవలో నిమగ్నమైన డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వీసా కాలపరిమితిని పొడిగిస్తున్నాం. కరోనాతో పోరాడుతూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వారి పట్ల కృతజ్ఞతాభావం చాటుకునే సమయం ఇది. వీసా ప్రక్రియ కారణంగా వారి దృష్టి మరలడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆటోమేటిక్‌గా ఏడాదిపాటు వీసాను మేమే పొడిగించాం.
కాబట్టి ఎవరూ వీసా కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకు సంబంధించిన ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తిస్తుంది’’ అని ప్రీతి పటేల్ ఒక ప్రకటనలో వివరించారు. అదే విధంగా… కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నర్సుల పనివేళల నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా బ్రిటన్‌లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ క్రమంలో అక్కడ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.