Ukraine Russia War : పుతిన్‌పై బైడెన్ కామెంట్స్‌.. వైట్ హౌస్ వివరణ..!

Ukraine Russia War : అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరో వివాదాన్ని రేపారు. పుతిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచదేశాలను టెన్షన్‌లో పెట్టాయి. అటు రష్యా కూడా ఘాటుగా స్పందించింది.

Ukraine Russia War : పుతిన్‌పై బైడెన్ కామెంట్స్‌.. వైట్ హౌస్ వివరణ..!

Ukraine Russia War Russia Intensifies Attacks As Biden Says Putin Cannot Remain In Power

Ukraine Russia War : అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరో వివాదాన్ని రేపారు. పుతిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచదేశాలను టెన్షన్‌లో పెట్టాయి. అటు రష్యా కూడా ఘాటుగా స్పందించింది. దీంతో వైట్‌హౌస్‌ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. అబ్బే బైడెన్‌ ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ పుతిన్‌ అధికారంలో కొనసాగకూడదు…. అతనికి ఆ అర్హత లేదు… ఇదీ పోలాండ్‌ రాజధాని వార్సాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆవేశంతో చేసిన ప్రకటన. ఇప్పుడు ఇదే సంచలనం సృష్టిస్తోంది. రష్యాలో అధికార మార్పిడికి అమెరికా ప్రయత్నిస్తోందన్న వాదనలు మొదలయ్యాయి. పుతిన్‌ను గద్దె దింపేందుకు అమెరికా ఏమైనా చేస్తుందని అవసరమైతే చంపేస్తుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దౌత్యవర్గాలైతే బైడెన్‌ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటనేది వెతుక్కునే పనిలో పడ్డాయి. అటు రష్యా కూడా ఘాటుగానే స్పందించింది. రష్యా అధ్యక్షుడిని దింపేసే అధికారం బైడెన్‌కు లేదని కౌంటర్‌ ఇచ్చింది. రష్యాను ఎవరు పాలించాలో బైడెన్ నిర్ణయిస్తారా అని నిలదీసింది.

Read Also : Russia ukraine war : యుక్రెయిన్ పై యుద్ధంలో టార్గెట్స్ మిస్ అవుతున్న రష్యా..60 శాతం మిస్సైల్స్ విఫ‌లం

అటు రష్యా స్పందన, ఇటు దౌత్యవర్గాల్లో చర్చతో వైట్‌హౌస్‌ రంగంలోకి దిగింది. బైడెన్‌ ఉద్దేశం పుతిన్‌ను ఏదో చేయడం కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. రష్యాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటును తాము కోరుకోవడం  లేదని తెలిపింది. పొరుగుదేశాలపై అధికారం చెలాయించే హక్కు పుతిన్‌కు లేదని చెప్పడంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేసింది. బైడెన్‌ ప్రకటనతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడిని పెంచుతుందని అమెరికా అంచనా వేస్తే అది వేరే విధంగా వెళ్లింది. నిజానికి బైడెన్‌ కోసం వైట్‌హౌస్‌ సిద్ధం చేసిన ప్రకటనలో ఈ వ్యాఖ్యలు లేవు. కానీ బైడెన్‌ హఠాత్తుగా ఇలాంటి కామెంట్లు చేశారు. దీంతో అధికారులు కూడా ఏం చేయాలో అర్థంకాక అధికారులు అప్పటికప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పుతిన్‌ను విమర్శించడం కొత్త కాకపోయినా బైడెన్‌ వాడిన పదాలే తీవ్ర చర్చకు దారితీశాయి.

మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి నాటో దేశాలపై విమర్శలు గుప్పించారు. రష్యా దాడులు పెరగడంతో మరిన్ని ఆయుధాలు, ట్యాంకులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధవిమానాలు పంపాలని ప్రపంచ దేశాలను అభ్యర్థించిన ఆయన నాటో దేశాలపై విమర్శలు చేశారు. యూరోప్‌లో భారీ ఆయుధాలు గోడౌన్లలో దుమ్ముపేరుకుపోయాయని వాటిని తమకు అందించాలని కోరారు. కేవలం మెషిన్‌గన్‌లతో రష్యా విమానాలను పేల్చేయలేమని గుర్తించాలన్నారు. 31 రోజులు గడిచాయని… ఇంత జరుగుతుంటే నాటో ఏం చేస్తోందని నిలదీశారు. వారు దేనికోసం ఎదురు చూస్తున్నారని ప్రశ్నించారు జెలెన్‌స్కీ. నాటో వద్ద ఉన్న వాటిలో తాము కేవలం 1శాతం మాత్రమే అడుగుతున్నామన్నారు. ఇటు రష్యా యుక్రెయిన్‌ను రెండు ముక్కలు చేయాలని భావిస్తోందని యుక్రెయిన్‌ అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తిగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాకపోవడంతో ఉత్తరకొరియా, దక్షిణకొరియా తరహాలో రెండు భాగాలుగా చేయాలని భావిస్తున్నట్లు యుక్రెయిన్ నిఘా వర్గాలు చెబుతున్నాయి.

Read Also : Russian Generals : రష్యన్‌ జనరల్స్‌పై యుక్రెయిన్ బలగాల టార్గెట్..!