H1 B వీసా గడువు పొడిగించే యోచనలో అగ్రరాజ్యం

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయుల వీసా పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) తన వెబ్‌సైట్‌లో ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని త్వరగా పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది.
అమెరికా నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులకు కొంత ఊరట లభించింది. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్ తెలిపింది. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం భారీ ఊరట నిస్తుందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయుల హెచ్ 1 బీ వీసాతో సహా వివిధరకాల వీసాల చెల్లుబాటు పొడిగించాలని గతవారం భారత ప్రభుత్వం కోరిన నేపధ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో వలసదారుల వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను వారు తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది.
Also Read | లాక్ డౌన్ కష్టాలు 2.0 : వలస కూలీలపై విరిగిన లాఠీ