అమెరికాలోని 3 లక్షల మంది చైనా విద్యార్థులకు షాక్… వారంతా ఇక ఇంటికే?

ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి ఇటీవల పెరుగుతోంది.

అమెరికాలోని 3 లక్షల మంది చైనా విద్యార్థులకు షాక్… వారంతా ఇక ఇంటికే?

Donald Trump

Updated On : May 29, 2025 / 9:38 AM IST

చైనా స్టూడెంట్ల వీసాలను రద్దు చేయడానికి తమ గవర్నమెంట్ ఏర్పాట్లు చేసుకుంటోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ప్రధానంగా పరిశోధన రంగాల్లో విద్యనభ్యసిస్తున్న వారు, చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధాలు ఉన్నవారి వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

మార్కో రూబియో చేసిన ప్రకటనపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. యూఎస్‌లోని యూనివర్సిటీలకు చైనాతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి ఇటీవల పెరుగుతోంది.

డ్యూక్‌ యూనివర్సిటీకి ఈ మేరకు రిపబ్లికన్ ఎంపీలు సూచనలు చేశారు. అమెరికా ఫండ్స్‌తో నిర్వహిస్తున్న అధ్యయనాలను చైనా స్టూడెంట్స్‌ తెలుసుకుంటున్నారని అన్నారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అత్యధిక విదేశీ విద్యార్థుల సంఖ్యలో తొలి స్థానం భారత్‌ స్టూడెంట్లదే.

ఆ తర్వాతి స్థానంలో చైనా స్టూడెంట్లు ఉన్నారు. అమెరికాలో గత ఏడాది 277,398 మంది చైనా విద్యార్థులు చదువుకున్నారు. విదేశీ స్టూడెంట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే కఠిన నిబంధనలు
ఇటీవల అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న తప్పిదాలకు కూడా విదేశీ విద్యార్థులను దేశం విడిచిపోవాలని ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అలాగే అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు తరగతులు ఎగ్గొట్టినా, వారు డ్రాప్ అవ్వడమో, ముందుగా సమాచారం లేకుండా చదువు మానేయడమో చేస్తే, వారి విద్యాసంస్థలు వారి వీసాలను రద్దు చేస్తాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ అమెరికా వీసా పొందే అర్హత కోల్పోతారని హెచ్చరించింది.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశాల మేరకు విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను విశ్లేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తించేందుకు ఇది అవసరమని చెప్పారు.