ఇదో రికార్డు : 9 నిమిషాల్లో ఆరుగురికి జననం

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. ఒకేసారి ఇలా కావడం 470 కోట్ల ప్రసవాల్లో ఒకరికి సాధ్యమౌతుందని వైద్యులు వెల్లడించారు. హూస్టన్‌కు చెందిన తెల్మా చియాక అనే మహిళ మార్చి 16వ తేదీ శుక్రవారం ఉదయం 4.50 – 4.59 గంటల మధ్య నలుగురు మగ పిల్లలు, ఇద్దరు ఆడశిశువులను ప్రసవించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంటే కేవలం 9 నిమిషాల్లో జన్మనిచ్చిందన్నమాట. తన బిడ్డలకు జినా, జురియెల్ అంటూ పేరు పెట్టింది. నలుగురు కొడుకులకు ఏం పేర్లు పెట్టాలా అని ఆలోచిస్తోందంట.
ప్రస్తుతం తల్లి తెల్మా చియాక ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే..ఇక్కడ శిశువులు తక్కువ బరువుతో ఉన్నారని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు వీరికి తగిన చికిత్స అందించాల్సి ఉంటుందని డాక్టర్స్ చెప్పారు.