Thailand vs Cambodia Conflict: ఓ గుడి కోసం రెండు దేశాల ‘యుద్ధం’.. ఏంటి ఆ ఆలయ చరిత్ర? ప్రత్యేకత?

ఇప్పటి ఘర్షణలు తా ముయేన్ తోమ్ దేవాలయం చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. డాంగ్‌రెక్ పర్వతాలలో అడవులతో కూడిన సరిహద్దులో ఉన్న ఖ్మేర్ హిందూ కాంప్లెక్స్‌లో మూడు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి.

Thailand vs Cambodia Conflict: ఓ గుడి కోసం రెండు దేశాల ‘యుద్ధం’.. ఏంటి ఆ ఆలయ చరిత్ర? ప్రత్యేకత?

Updated On : July 25, 2025 / 3:26 PM IST

థాయిలాండ్-కాంబోడియా మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ వివాదానికి కేంద్ర బిందువు హిందూ దేవాలయమని మీకు తెలుసా?

కాంబోడియా డాంగ్‌రెక్ పర్వతాలలో 525 మీటర్ల ఎత్తులో ఉంది 900 ఏళ్ల పురాతన ప్రీహ్ విహియర్ దేవాలయం. ఇది పరమేశ్వరుడి ఆలయం. ఖ్మేర్ సామ్రాజ్య కాలంలో నిర్మించారు. ఇది కేవలం కాంబోడియన్లకు కాదు, థాయ్ ప్రజలకూ పవిత్ర స్థలం. దీని నుంచి సుమారు 95 కిలోమీటర్ల పశ్చిమాన 12వ శతాబ్దపు శివాలయమైన తా ముయేన్ తోమ్ దేవాలయం కూడా ఉంది.

అనేక దశాబ్దాలుగా ఈ దేవాలయ సముదాయం రెండు దేశాల మధ్య వివాదానికి కేంద్రంగా ఉంది. ఈ దేవాలయం కోసం థాయిలాండ్-కాంబోడియా మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం థాయిలాండ్-కాంబోడియా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగి, 12 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పెద్ద సంఖ్యలో నిరాశ్రయులయ్యారు.

తాజాగా జరిగిన యుద్ధం గురువారం తెల్లవారుజామున తా ముయేన్ తోమ్ దేవాలయం సమీపంలోని థాయిలాండ్ సురిన్ ప్రావిన్స్‌లో ప్రారంభమైంది. థాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాంబోడియా సైన్యం థాయ్ సైనిక స్థావరాలపై నిఘా కోసం డ్రోన్లను పంపడంతో ఘర్షణ మొదలైంది.

థాయ్ సైన్యం శాంతికి చేసిన యత్నాలు విఫలమయ్యాయి. ఉదయం 8.20 గంటలకు భారీస్థాయిలో కాల్పులు మొదలయ్యాయి. కాంబోడియా మాత్రం థాయిలాండ్ తమ ప్రాదేశికాధికారాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది.

థాయిలాండ్ అన్ని సరిహద్దు మార్గాలను పూర్తిగా మూసివేసింది. సుమారు 40,000 థాయ్ పౌరులు 86 గ్రామాలను ఖాళీ చేసి వెళ్లారు. ఈ సరిహద్దు వివాదం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కాంబోడియాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. 1954 తర్వాత శిల్పాలను తిరిగి ఇవ్వాలని, థాయిలాండ్ తన సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.

ఆ తీర్పు 1907లో ఫ్రెంచ్ మ్యాప్ ఆధారంగా వెలువడింది. ఆ మ్యాప్ ప్రకారం ఆ ఆలయం కాంబోడియాలోకి వస్తుంది. అప్పట్లో సియామ్ (ఇప్పటి థాయిలాండ్) ఈ మ్యాప్‌ను అంగీకరించింది. అయితే ఆ తర్వాత సరిహద్దు పర్వత రేఖల ఆధారంగా ఉందని తప్పుగా భావించామన్న వాదన చేసింది.

కానీ న్యాయస్థానం ఆ వాదనను తిరస్కరించి, మ్యాప్‌ను అంగీకరించిన థాయిలాండ్ ఆ దానికి కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చింది. 2013లో, 2011లో జరిగిన ఘర్షణల తర్వాత, న్యాయస్థానం తన మొదటి తీర్పుపై సమీక్ష జరిపింది. ఆలయం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపైనా కాంబోడియాకు హక్కు ఉందని పేర్కొంది. థాయ్ సైన్యం అక్కడినుంచి వెళ్లాలని ఆదేశించింది.

ఖ్మేర్ హిందూ కాంప్లెక్స్‌లో మూడు ప్రధాన దేవాలయాలు
ఇప్పటి ఘర్షణలు తా ముయేన్ తోమ్ దేవాలయం చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. డాంగ్‌రెక్ పర్వతాలలో అడవులతో కూడిన సరిహద్దులో ఉన్న ఈ తక్కువ ప్రాచుర్యం ఉన్న ఖ్మేర్ హిందూ కాంప్లెక్స్‌లో మూడు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. అవి తా ముయేన్ తోమ్, తా ముయేన్, తా ముయేన్ టాట్.

తా ముయేన్ తోమ్ ఆలయ నిర్మాణంలో దక్షిణ దిశకు గర్భగుడి ఉంది. ఇది సాధారణ ఖ్మేర్ ఆలయాల నిర్మాణ పద్ధతికి భిన్నంగా ఉంటుంది. గర్భగుడిలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉంది.

దేవాలయ స్థానం దీనిని తరచూ ఘర్షణల కేంద్రంగా మారుస్తోంది. ఫిబ్రవరిలో కాంబోడియా సైనికులు ఈ ఆలయంలో తమ జాతీయ గీతాన్ని పాడారు. ఇది థాయ్ సైనికుల్లో ఆగ్రహం రేపింది. ఈ ఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది.