Mahatma Gandhi: మహాత్మా గాంధీజీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు ఇవ్వలేదో తెలుసా? 5 కారణాలు..
గాంధీజీ రాజకీయ నాయకుడు కాదు.. ఏ అంతర్జాతీయ చట్టాన్నీ ప్రతిపాదించిన వ్యక్తి కాదు..

Mahatma Gandhi
Nobel Peace Prize: పౌర హక్కులు, శాంతి కోసం ఉద్యమించిన అమెరికా నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌కు 1964లో నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. బౌద్ధమత గురువు 14వ దలైలామాకు 1989లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. నల్లజాతి సూరీడుగా పిలుచుకునే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు 1993లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
మరి అహింసా మార్గంలో నడిచి ప్రపంచాన్నే కదిలించి వేసేలా ఉద్యమాలు చేపట్టిన భారత జాతిపిత మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు? ప్రపంచంలోని గొప్ప గొప్ప నేతలు తమకు గాంధీజీనే ఆదర్శమని చెప్పుకుంటారు. గాంధీజీని 1937, 1938, 1939, 1947, 1948 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు.
శాంతి, అహింస విషయంలో ఎనలేని కృషి చేసినప్పటికీ గాంధీ ఆ పురస్కారాన్ని అందుకోలేకపోయారు. దీనిపై చాలా కాలంగా అనేక వాదనలు జరుగుతున్నాయి. గాంధీకి నోబెల్ పురస్కారం ఎందుకు ఇవ్వలేదన్న విషయానికి ఒక ప్రధానమైన కారణం ఉంది.
కారణాలు ఇవే..
నోబెల్ బహుమతి కొన్ని నిబంధనలు పెట్టుకుంది. ఏ కేటగిరీలో ఎవరికి నోబెల్ పురస్కారం ప్రదానం చేయాలన్న దానిపై రూల్స్ ఉన్నాయి. నోబెల్ పెట్టుకున్న ఆ నిబంధనల్లో ఒక్క కేటగిరీ కింద కూడా గాంధీజీ లేరు.
ఆ కమిటీ ఏం చెబుతోందంటే..
గాంధీజీ రాజకీయ నాయకుడు కాదు..
ఏ అంతర్జాతీయ చట్టాన్నీ ప్రతిపాదించిన వ్యక్తి కాదు..
మానవతావాద సహాయ కార్యకర్త కాదు..
అంతర్జాతీయ శాంతి సభల నిర్వాహకుడు కాదు..
ఈ అంశాలనే ప్రధానంగా చూపుతూ ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అంతేగాక..
గాంధీజీ శాంతివాదం విషయంలో, 1947లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో మహాత్మా గాంధీ జోక్యంపై నోబెల్ కమిటీకి అభ్యంతరాలు ఉన్నాయి
ఘర్షణల్లో గాంధీజీ ఒకే వైపు పక్షపాతం చూపారంటూ నోబెల్ కమిటీలోని పలువురు సభ్యులు భావించారు
గాంధీజీ యుద్ధ వ్యతిరేకతపై కూడా వారికి కొన్ని సందేహాలు ఉన్నాయి
కాగా, నోబెల్ బహుమతికి చివరగా గాంధీజీ 1948లో నామినేట్ చేశారు. అనంతరం నాలుగు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. అప్పట్లో మరణానంతరం నోబెల్ పురస్కారం ఇచ్చే సంప్రదాయం లేదు. ఒకవేళ గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఇస్తే అందుకు సంబంధించిన నగదును ఎవరికి ఇవ్వాలనే సందేహం కూడా అప్పట్లో వచ్చింది.
గాంధీకి ట్రస్టులుగానీ, ఇతర సంఘాలు గానీ లేవు. ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరకీ ఇవ్వలేదు. ఈ పురస్కారం అందుకోవడానికి జీవించి ఉన్న అర్హులు ఎవరూ లేరని నోబెల్ కమిటీ ఓ ప్రకటన చేసింది.
Plastic stools : ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రం ఎందుకుంటుందో తెలుసా..?