చెప్పినట్లే చేసిండు..! ట్రంప్‌కు షాకిస్తూ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. పార్టీ పేరేంటో తెలుసా..

అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.

చెప్పినట్లే చేసిండు..! ట్రంప్‌కు షాకిస్తూ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. పార్టీ పేరేంటో తెలుసా..

Elon Musk

Updated On : July 6, 2025 / 7:21 AM IST

Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చెప్పినట్టే చేశాడు. ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్లు’ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గకుంటే అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని మస్క్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ మాత్రం మస్క్‌ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా బిగ్ బ్యూటీఫుల్ బిల్లు చట్టంగా మారింది. శుక్రవారం అధ్యక్షుడి సంతకంతో చట్టం రూపు సంతరించుకుంది. దీంతో ఎలాన్ మస్క్ ఇటీవల తాను చెప్పినట్లే కొత్త పార్టీని ప్రకటించారు.

‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ చెప్పారు.

గతంలో ఎక్స్‌లోనూ ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో 80శాతం మంది మస్క్ కు మద్దతుగా ఓటు వేశారు. ఈ క్రమంలో అప్పట్లోనే ‘ది అమెరికా పార్టీ’ అంటూ ఆయన చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారిన మరుసటిరోజే మస్క్ కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు.

మస్క్ తన రాజకీయ ప్రణాళికను ఎక్స్‌లో వెల్లడించారు. ‘మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు తప్పక వస్తుంది. పనికిరాని నిర్ణయాలు, అవినీతి మన దేశాన్ని దివాలా తీసే విషయానికి వస్తే, మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏక పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాము. నేడు, మీకు స్వేచ్ఛ తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది’ అంటూ మస్క్ పేర్కొన్నాడు.