కమల్ నాథ్ వైఫల్యం వల్లే కరోనా కేసులు పెరిగాయ్

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2020 / 08:42 AM IST
కమల్ నాథ్ వైఫల్యం వల్లే కరోనా కేసులు పెరిగాయ్

Updated On : October 31, 2020 / 12:18 PM IST

ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్‌నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.  అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివరాజ్ సింగ్ అన్నారు. కరోనా విజృభిస్తున్నా సరే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, అరికట్టడంలో వైఫల్యం చెందిందని ఆయన మండిపడ్డారు.

శనివారం(మే-2,2020)ఈ-అజెండా ఆజ్ తక్ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ…ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రే. ఆ పదవిలో ఉన్నంత కాలం బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. బాధ్యతలను విడిచిపెట్టి ఎలా వెళ్లిపోతారు? మేము మాత్రం పరిస్థితిని అదుపులోకి తేవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. తాను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేనాటికే ఇండోర్‌లో కేసులు నమోదయ్యాయని, ఆ సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు.

అప్పటి కమల్‌నాథ్ ప్రభుత్వం ఎలాంటి నష్ట నివారణా చర్యలకు ఉపక్రమించలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే, అధికారులను బదిలీచేసి, నిత్యం వారితో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇండోర్‌లో ఇప్పటికే కరోనా పరీక్షల సంఖ్యను పెంచామని, ఇంటింటి సర్వేను కూడా చేపట్టి నష్ట నివారణా చర్యలు ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం ఇండోర్‌లో పరిస్థితి పూర్తి అదుపులోనే ఉందని తాను భావిస్తున్నానని, అలాగే కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్.

కాగా, మార్చి నెల ప్రారంభంలో మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 ఎమ్మెల్యేలు కమల్‌నాథ్‌తో విభేదించి.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అంతేకాదు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు వారంతా కాంగ్రెస్ పార్టీని వీడారు. దాంతో కమల్‌నాథ్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో.. ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతిచ్చారు. ఇక రాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని కమల్‌నాథ్‌ని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. బలనిరూపణ పరీక్షకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మార్చి-23న బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

మరోవైపు,కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటి. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 2,719 పాజిటివ్ కేసులు నమోదుకాగా,145మంది మరణించారు. 524మంది కోలుకున్నారు. అయితే భారత్ లో అత్యధిక కరోనా మరణాలు నమోదైన మూడవ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.

Also Read | రెడ్ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్ అమలు: కిషన్ రెడ్డి