Kadapa Dist : ప్రేమ వ్యవహారం, కన్నకూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
తాము చూసిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు. చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కన్న తల్లిదండ్రులు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలోని రాయచోటిలో చోటు చేసుకుంది.

Kadapa Dist
kadapa Dist woman allegedly set ablaze by her family members : తాము చూసిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని కూతురు. చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కన్న తల్లిదండ్రులు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలోని రాయచోటిలో చోటు చేసుకుంది. రాయచోటిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. యువతి..ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లదండ్రులకు తెలిసింది. యువతిని మందలించారు.
ఆ యువకుడితో పెళ్లి చేసుకుంటుందని భావించిన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. వచ్చిన సంబంధాలన్నీ కూతురు చెడగొడుతోందని తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. కొద్ది రోజులుగా ఈ విషయంలో యువతి..తల్లిదండ్రుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంటోంది. 2021, జూన్ 15వ తేదీ మంగళవారం మరోసారి కుటుంబసభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేశారు.
తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని యువతి తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు..కన్న కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందులో సోదరుడు కూడా ఉన్నాడు. మంటలకు తాళలేక యువతి కేకలు వేయడంతో సోదరి, స్థానికులు వచ్చి మంటలను ఆర్పారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.