Six States In Bypolls: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు నియోజకవర్గాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్

దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీహార్‌ రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల్లో, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్రలో ఒక్కొక్క అసెంబ్లీ స్థానంకు ఉదయం 7గంటల నుంచి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.

Six States In Bypolls: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు నియోజకవర్గాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్

ByPoll

Updated On : November 3, 2022 / 9:14 AM IST

Six States In Bypolls: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీహార్‌ రాష్ట్రంలోని మొకామా, గోపాల్‌గంజ్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అదేవిధంగా హర్యానాలోని అడంపూర్, తెలంగాణాలోని మునుగోడు, ఉత్తరప్రదేశ్‌లోని గోలా, ఒడిశాలోని ధామ్‌నగర్‌, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.

Gujarat Assembly Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగంసిద్ధం.. నేడు షెడ్యూల్‌ను ప్రకటించనున్న ఈసీ

– తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిని ప్రధానంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు ఉదయం 7గంటల నుంచి నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చండూరు మండలం ఇడికుడలో ఓటు హక్కును వినియోగించుకోగా, తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో ఓటు వేశారు. ఉదయం 7గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకొనేందుకు బారులు తీరారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

– బీహార్ రాష్ట్రంలో మొకామా, గోపాల్‌గంజ్ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఆ స్థానాలు గతంలో ఆర్జేడీ, బీజేపీలు గెలుపొందాయి. మోకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో దోషిగా తేలడంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా గోపాల్‌గంజ్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సుభాష్ సింగ్ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి.

– ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోలా గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ గిరి సెప్టెంబర్ 6న మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఉప ఎన్నికలకు దూరంగా ఉండడంతో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ఉపపోరు కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

– మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు) నియోజకవర్గంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. మహారాష్ట్రలో రాజకీయ చీలిక ఏర్పడి ఏక్ నాథ్ షిండే సీఎం అయిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థిని పోటీకి దింపలేదు. ఉద్దవ్ ఠాక్రే వర్గం ఆ స్థానం నుంచి రమేష్ లత్కే సతీమణి రుతుజా లత్కేను బరిలోకి దింపారు.

– హర్యానా రాష్ట్రం హిసార్ జిల్లాలో అడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ చిన్న కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యమైంది. నేడు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

– ఒడిషా రాష్ట్రంలో ధామ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న బిష్ణు చరణ్ సేథీ మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరగుతున్నాయి. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.