Chittoor District: ఏనుగుల గుంపు హల్చల్.. భయాందోళనలో గ్రామాలు!

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. సుమారు 38 ఏనుగుల భారీ గుంపు కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో తిష్ట వేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Chittoor District: ఏనుగుల గుంపు హల్చల్.. భయాందోళనలో గ్రామాలు!

Chittoor District

Updated On : June 2, 2021 / 4:13 PM IST

Chittoor District: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. సుమారు 38 ఏనుగుల భారీ గుంపు కొన్ని రోజులుగా గ్రామ సమీపంలో తిష్ట వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే.. తాజాగా ఏనుగుల మంద రోడ్డు దాటుతుండగా చూసిన స్థానికులు మొబైల్ ఫోన్లతో వీడియో తీసి సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో పాటు మీడియాకు అందించారు.

అనంతరం అటవీశాఖకు కూడా సమాచారమివ్వడంతో గ్రామానికి చేరుకున్న అధికారులు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి ఏనుగుల గుంపును తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా.. ఏనుగుల మంద సంచరించడంతో సమీప గ్రామాలకు కంటి మీద కునుకులేకుండా పోతుంది. ప్రతి ఏడాది వేసవి కాలంలో ఇలా చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలలో ఏనుగల మందల హల్చల్ చేస్తుండగా అటవీ అధికారులు దీనికి పరిష్కారంపై కూడా సమాలోచనలు చేస్తున్నారు.

వేసవి వచ్చిందంటే చిత్తూరు జిల్లా వాసులకు గజరాజుల బెడద తప్పడం లేదు. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను దాటి జిల్లాలోని పలు అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి. వేసవి కావడంతో దాహార్తిని తీర్చుకునేందుకు పంట పొలాలు., అటవీ సమీప ప్రాంత గ్రామాల వైపు హాథీలు పరుగులు పెడుతుంటాయి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి అక్కడి అటవీ సిబ్బందే కౌండిన్య అటవీ ప్రాంతం వైపు ఏనుగులను తరిమేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుండగా ఇరు రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రతిఏడాది సాధారణమే అయింది.