కేంద్రమంత్రి గజేంద్రసింగ్ తో సీఎం కేసీఆర్ భేటీ…రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై చర్చ

CM KCR meets Union Minister Gajendrasingh Shekhawat : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు సీఎం.. షెకావత్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై కేసీఆర్ కేంద్రమంత్రితో చర్చించినట్లు సమాచారం.. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం..
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.. ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి మాత్రమే అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని గజేంద్రసింగ్ షెకావత్ నివాసంలో కేసీఆర్ ఆయనను కలిశారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధుల విడుదల చేయాలని కేసీఆర్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, సాగు నీటి ప్రాజెక్టుల పురోగతిపైనా ఆయనతో చర్చించారని తెలుస్తోంది. అక్టోబర్ 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అపెక్స్ భేటీలో తెలంగాణ వాదనను కేసీఆర్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు నేరుగా ఆయనను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేసీఆర్ చర్చించారు.