దృశ్యం2 రివ్యూ..

ఆరేళ్ల క్రితం.. దక్షిణాదిలో అన్నీ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమా దృశ్యం.. ఈ సినిమాకు సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు.. సంచలన విజయం సాధించిన మలయాళ సినిమా దృశ్యం.. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో రీమేక్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి మలయాళంలో సీక్వెల్ తెరకెక్కింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సేమ్ కాస్ట్ అండ్ క్రూతో జీతు జోసెఫ్ రూపొందించిన ఈ సినిమా నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సీక్వెల్ అంచనాలను నిలబెట్టుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ: కేబుల్ ఆపరేటర్ జార్జి కుట్టి (మోహన్ లాల్).. కుటుంబంలో ఆరు సంవత్సరాల్లో అనేక మార్పులు వచ్చాయి.. కేబుల్ టివి ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ యజమానిగా ఎదిగాడు. చిత్ర నిర్మాత కూడా అవుతాడు. మొదటి భాగం కంటిన్యూగా వచ్చిన ఈ సినిమాలో గతం తాలూకూ విషయాలను మరిచిపోయి ప్రశాంతగా జీవిస్తూ ఉంటాడు జార్జి కుట్టి. అయితే కేసును ఛేదించలేకపోయిన పోలీసులు.. అవమాన భారంతో రగిలిపోతూ ఉంటారు.. ఈ క్రమంలో బ్యాక్‌గ్రౌండ్‌లో కుట్టికి తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు పోలీసులు.. అక్కడే చిన్న క్లూ దొరుకుతుంది పోలీసులకు అప్పుడు ఆ క్లూతో ఏం చేశారు.? జార్జి కుట్టి మళ్లీ కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కథ.. దృశ్యం సినిమా కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే సీక్వెల్ కథ మొదలవుతుంది.
స్క్రీన్‌ప్లే-విశ్లేషణ:
దృశ్యం మొదటి భాగానికి వస్తే.. ఓ వ్యక్తిని చంపేసి పాతిపెట్టాక.. ఆ కేసులో దొరకకుండా ఫ్యామిలీని కాపాడుకుంటాడు హీరో.. చివరకు పోలీసులు నుంచి తప్పించుకోవడంతో దృశ్యం సినిమా ముగుస్తుంది. దృశ్యం సీక్వెల్.. ఇంకేముంది ఎంత తీసినా.. అంత ఇంట్రస్టింగ్‌గా తీయలేరు అనిపిస్తుంది.. కానీ పార్ట్ 2 కూడా ఏ మాత్రం ఇంట్రస్ట్ తగ్గకుండా తెరకెక్కించాడు దర్శకుడు. వరుణ్ మృతదేహాన్ని ఎవరూ ఊహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెట్టి ఆ కేసు నుంచి తెలివిగా బయటపడ్డ తర్వాత.. అనుకోకుండా.. అదే సమస్య మళ్లీ వస్తే.. సమస్య తీరిపోయింది అనుకుని సంతోషంగా ఉన్న వ్యక్తికి సమస్య తీరలేదని తెలిసి, కేసులో పోలీసులకు దొరికిన సాక్ష్యాలు కీలకం అయినప్పుడు హీరో ఏం చేశాడనే విషయాలను ఆసక్తికరంగా రూపొందించారు. సాధారణంగా సీక్వెల్స్ అనేవి.. క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు తీసే సినిమాలు అని ప్రేక్షకుల్లో అభిప్రాయం ఉంది.. కానీ, పక్కా స్క్రీన్‌ప్లేతో.. ఆసక్తికరంగా తీసిన సినిమా దృశ్యం సీక్వెల్..
నటీనటులు:
దృశ్యం సినిమాలో నటించినవాళ్లే దాదాపుగా ఉండగా.. సినిమాలో ప్రతిఒక్కరి నటన చాలా బాగుంది.. మోహన్ లాల్, మీనా, అన్సిబా, ఎస్తేర్ అనిల్, మురళి గోపి, ఆశా శరత్, సిద్దిఖ్ తదితరులు బాగా నటించారు.
సాంకేతిక వర్గం:
సీక్వెల్‌లు మొక్కుబడిగా తీస్తుంటారు అనేది ప్రజల్లో ఉండే అభిప్రాయం.. ఈ సినిమా మాత్రం ఎక్కడా తగ్గకుండా సాంకేతిక వర్గం అంతా చాలా జాగ్రత్తగా వర్క్ చేశారు.. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. జీతు జోసెఫ్ దర్శకత్వం బాగుంది.
ఓవరాల్‌గా అంచనాలకు ఏ మాత్రం తగ్గని దృశ్యం..