ఢిల్లీలో రైతు ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణ

Farmers Protest News : ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. జనవరి 7న ఢిల్లీ నాలుగు సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నారు. జనవరి 26న చేపట్టే ట్రాక్టర్ ర్యాలీకి జనవరి 7న రిహార్సల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా దేశ్ జాగరణ అభియాన్ పేరిట ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 6న షాజహాన్ పూర్ వద్ద రోడ్లపై బైఠాయించి..ఢిల్లీ వైపు మార్చ్ చేపడుతామన్నారు.
భోగి ,సంక్రాంతి సందర్భంగా కిసాన్ సంకల్ప్ దివస్ జరువుతూ మూడు వ్యవసాయ చట్టాలను తగలబెట్టాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. జనవరి 18న మహిళా కిసాన్ దివస్, జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆజాద్ హింద్ కిసాన్ దివస్ జరుపుతామన్నారు రైతు సంఘాల నేతలు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్ల అధికారిక నివాసాల ఎదుట ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జనవరి 26న ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర పరేడ్ అనంతరం…కిసాన్ పరేడ్ నిర్వహిస్తామన్నారు అన్నదాతలు.
కేంద్రానికి- రైతు సంఘాలకు మధ్య జరగిన ఏడో దశ చర్చలు అసంపూర్తిగా ముగియడంతో.. జనవరి 8న మరోసారి భేటి కావాలని నిర్ణయించాయి. చర్చలో భాగంగా రైతు సంఘాలు మూడు కొత్త చట్టాలని రద్దు చేయాలన్న డిమాండ్‌కు కేంద్రం ససేమిరా అంటోంది. చట్టాల్లోని ప్రతి క్లాజుపై చర్చించాలని కోరిన ప్రభుత్వం… అవసరమైన సవరణలకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. అయితే రైతు సంఘాలు మాత్రం.. సవరణలు వద్దు, రద్దే చేయాలని పట్టుబట్టాయి.