గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌‌పై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ!

  • Published By: sreehari ,Published On : July 2, 2020 / 10:45 PM IST
గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌‌పై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ!

Updated On : July 3, 2020 / 7:26 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో… ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రజా నిర్ణయానికి అనుగుణంగా మరో రెండ్రోజుల్లో లాక్‌డౌన్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నా… మారుతున్న పరిణామాలతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ విధించడం వల్ల కరోనా కట్టడి సాధ్యంకాదంటున్న కొందరు ఉన్నతాధికారుల అభిప్రాయంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విషయంలో వెనకడుగు వేస్తోంది. లాక్‌డౌన్‌ విధించడం కంటే పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ… మరింత నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పడంతో ప్రభుత్వం అటువైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

జిల్లాల్లో పెద్దగా ఇబ్బందులు లేకపోవడంతో హైదరాబాద్‌పైనే ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. గ్రేటర్‌ లాక్‌డౌన్‌పై కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ప్రభుత్వం… ప్రజాభిప్రాయ సేకరణకు మొగ్గుచూపింది. ప్రజల అభిప్రాయాన్ని బట్టే నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. దీంతో ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి… చిన్నవ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, రోజువారీ కూలీల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక రానుంది.

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇటీవల సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో రెండు-మూడ్రోజులు పరిస్థితిని గమనించి లాక్‌డౌన్‌ విధించడానికైనా వెనకాడమని స్పష్టం చేశారు. దీంతో అప్పటినుంచి గ్రేటర్‌ లాక్‌డౌన్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లాక్‌డౌన్‌ విధిస్తారని చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మొత్తంగా… లాక్‌డౌన్‌పై మరో రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా లాక్‌డౌన్‌ ఉండదన్న వాదనా గట్టిగానే వినిపిస్తోంది. మరి చూడాలి… ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.