పరమ భక్తుడిలా తెల్లారే గుడికొచ్చాడు, ప్రదక్షిణలు చేశాడు.. ఆ తర్వాత ఏకంగా అమ్మవారి నెక్లెస్‌తో ఉడాయించాడు

దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి దోచేస్తున్నారు.

పరమ భక్తుడిలా తెల్లారే గుడికొచ్చాడు, ప్రదక్షిణలు చేశాడు.. ఆ తర్వాత ఏకంగా అమ్మవారి నెక్లెస్‌తో ఉడాయించాడు

Updated On : March 6, 2021 / 2:17 PM IST

gold ornament robbery in nizampet temple: దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి దోచేస్తున్నారు. కొందరు దొంగల కన్ను ఆలయాలపై పడింది. భక్తుల ముసుగులో వచ్చి చోరీలు చేస్తున్నారు. అదీ పట్టపగలే, ఆలయ సిబ్బంది సహా అంతా ఉండగానే.

హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తెల్లవారుజామునే భక్తుడి ముసుగులో గుడికి వచ్చాడు. ఆ సమయంలో ఆలయ సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమవడంతో అదను చూసి అమ్మవారికే ఎసరుపెట్టాడు. అమ్మవారి మెడలోని ఆరు తులాల నెక్లెస్‌తో చాకచక్యంగా ఉడాయించాడు. ఆసల్యంగా చూసుకున్న సిబ్బంది లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

నిజాంపేటలోని భవ్యాస్ ఆనందంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పూజారి తెల్లవారుజామున 5.30 గంటలకు ఆలయాన్ని తెరిచారు. అంత పొద్దున్నే ఓ భక్తుడు ఆలయానికి వచ్చాడు. ఆ సమయంలో ఆలయ సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉండడంతో ప్రదక్షిణలు చేస్తున్నట్లు నటించాడు. అదను చూసి దిమ్మతిరిగే షాకిచ్చాడు. అమ్మవారి మెడలోని 6 తులాల నెక్లెస్‌ చోరీ చేసి అక్కడి నుంచి జారుకున్నాడు.

కాసేపటి తర్వాత అమ్మవారి నెక్లెస్ కనిపించకపోవడంతో ఆలయ సిబ్బంది కంగారు పడ్డారు. వారి అనుమానం నిజమైంది. దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీకి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ కోసం గాలిస్తున్నారు.