బ్రేకింగ్, తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బ్రేకింగ్, తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Updated On : June 21, 2021 / 5:40 PM IST

తెలంగాణలో కొత్త సెక్రటేరియట్(సచివాలయం) భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, కేబినెట్ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ప్రస్తుత సచివాలయంలో సదుపాయాలు లేవని, ప్రస్తుత భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన కోర్టు, ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం(జూన్ 29,2020) ఈ మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సచివాలయం కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకంగా 10 పిటిషన్లు:
సెక్రటేరియెట్ భవనాల కూల్చివేతపై దాఖలైన 10 పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చివరికి కొత్త సచివాలయ నిర్మాణానికి కోర్టు అనుమతించింది. హైకోర్టు తీర్పుతో కొత్త సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించిన కేసీఆర్ ప్రభుత్వం, ఈ మేరకు కేబినెట్‌లో కూడా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియెట్‌ భవనాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే తెలంగాణ సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని పదుల సంఖ్యలో పిటిషన్లు వచ్చాయి.

ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు:
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు… వాదనల్ని సుదీర్ఘంగా వినింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం శిథిలావస్థకు చేరుకుందని, ఇప్పుడున్న అవసరాలకు సరిపోవడం లేదని, పరిపాలనకు అనుగుణంగా సచివాలయ భవనాలు లేవని ప్రభుత్వం కూడా గట్టిగానే వాదనలు వినిపించింది. అందరి వాదనలు విన్న కోర్టు ఫైనల్ గా కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టుతో తీర్పుతో కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. కొత్త సచివాలయం నిర్మాణాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది.

2019 జూన్ 27న కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన:
తెలంగాణ ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ సర్కార్ భావించింది. ఈ మేరకు 2019 జూన్ 27వ తేదీన కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. 9 నెలల్లో భవనాన్ని పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ ప్లాన్ చేసింది. అయితే సచివాలయాన్ని కూల్చివేయవద్దని కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఆవరణలో ఉన్న ఏపీ భవనాలను కూడా తెలంగాణకు అప్పగించడంతో ఈ ప్రాంతంలో కూడా తెలంగాణకు అవసరమైన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.

కొత్త సచివాలయ నిర్మాణ డిజైన్లు కూడా రెడీ:
సచివాలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కూడా ప్రభుత్వం సిద్దం చేసింది. సచివాలయంలోని ప్రధాన కార్యాలయాలన్నీ ఆయా హెచ్ఓడీ కార్యాలయాలతో పాటు బూర్గుల రామకృష్ణారావు భవన్ కు తరలించిన విషయం తెలిసిందే. బూర్గుల రామకృష్ణారావు భవన్ లో ప్రస్తుతం తెలంగాణ సచివాలయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

సచివాలయ భవనాన్ని కూల్చివేత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సహా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మరో 10 మంది పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపి అందరి వాదనలు విన్న హైకోర్టు 2020 మార్చి 10వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ(జూన్ 29,2020) తుది తీర్పును వెల్లడించింది.

Read This :నీళ్లు తాగటానికి వచ్చిన కోతిని ఉరివేసి చంపేసిన దుర్మార్గులు