Man Eat Snake: పామును తింటే కరోనా రాదట.. వీడియో వైరల్!
కరోనాకు మందు.. రాకుండా ముందు జాగ్రత్త.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఉందా.. కరోనాను తొక్కి చంపేయాలని ఉందా.. అయితే ఇంటర్నెట్ నిండా అందుకు సంబంధించిన కథలే కనిపిస్తాయి. నిజానికి అందులో చాలా వరకు కట్టుకథలు ఎక్కువగా ఉంటున్నాయి.

Man Eat Snake
Man Eat Snake: కరోనాకు మందు.. రాకుండా ముందు జాగ్రత్త.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఉందా.. కరోనాను తొక్కి చంపేయాలని ఉందా.. అయితే ఇంటర్నెట్ నిండా అందుకు సంబంధించిన కథలే కనిపిస్తాయి. నిజానికి అందులో చాలా వరకు కట్టుకథలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఆ ప్రచారాలను నమ్ముకుంటే నట్టేట మునిగిపోవడం ఖాయమని ఎప్పుడో నిపుణులు చెప్పేశారు. అయితే.. వ్యూస్ కోసమో.. లేక మరేదో ప్రయోజనం కోసమో ఈ తరహా వీడియోలకు ఇంటర్నెట్ లో కొదువే లేదు.
కాగా.. ఇప్పుడు ఏకంగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా పామును తింటే కరోనా రాదని తాను స్వయంగా పామును తింటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఈ వీడియోకు ఎక్కడలేని ప్రచారం వచ్చేసింది. పామును తింటే కరోనా సంగతేమో కానీ మరేదో రోగం వచ్చి ఏకంగా కైలాసానికి పోవడం ఖాయమని కాస్త లోకజ్ఞానం ఎరిగిన వారికి తెలియనిది కాదు. అయితే.. ఈయన మాత్రం కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఈ పాములో పుష్కలంగా ఉన్నాయని.. అందుకే ఇది తింటే కరోనా రాదని వీడియోలో చెప్పాడు.
ఆయనకి కరోనా రావడంలో ఈ పాము ఏ మాత్రం అడ్డుకోలేదని తెలిసిన అంశమే కాగా.. పోలీసులు మాత్రం ఈయన్ని అరెస్ట్ చేసి జరిమానా కూడా విధించేశారు. తమిళనాడు మదురై జిల్లాలోని పెరుమల్పట్టి గ్రామానికి చెందిన వడివేలు అనే ఓ రైతు ఓ పామును తింటూ కరోనాకు దివ్యౌషధం అని చెప్పాడు. పామును వడివేలు తింటుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా ఇది వైరల్గా మారింది. ఇది కాస్త అటవీ అధికారులకు చేరడంతో అతనికి రూ.7 వేల రూపాయల జరిమానా విధించి హెచ్చరించి వదిలేశారు.