MAA Elections : రసవత్తరంగా ‘మా’ ఎలక్షన్స్.. అధ్యక్ష పదవికి మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ పోటీ..!
మా ఎన్నికల్లో.. అధ్యక్ష బరిలో యంగ్ హీరో మంచు విష్ణు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ పడబోతున్నారు..

Movie Artist Association Elections 2021
MAA Elections: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడూ రసవత్తరంగా జరుగుతుంటాయి. త్వరలో 2021 మా ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఎప్పటిలానే ఈసారి కూడా హోరాహోరీ పోరు నెలకొంది. మా ఎన్నికల అధ్యక్ష బరిలో యంగ్ హీరో మంచు విష్ణు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ పడబోతున్నారు.
అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తలబడబోతుండడంతో ఈ ఎలక్షన్స్ రసవత్తరంగా మారనున్నాయి. 2019 ఎలక్షన్స్‌లో నరేష్ ప్యానెల్, శివాజీ రాజా ప్యానెల్ పోటీ పడగా.. హోరాహోరీ పోరులో నరేష్ ప్యానెల్ గెలుపొందింది. విష్ణు, ప్రకాష్ రాజ్ ఇరువురు కూడా వారం రోజుల్లో తమ ప్యానెల్ సభ్యులు ఎవరు అనేది ప్రకటించే అవకాశం ఉంది. మెగా బ్రదర్ నాగబాబు, ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు.
మెగాస్టార్ – మోహన్ బాబు మైత్రి.. ప్రకాష్ రాజ్‌కి మెగా బ్రదర్ సపోర్ట్..
చిరంజీవి, మోహన్ బాబు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మా అసోసియేషన్ విషయంలో మెగాస్టార్ తీసుకునే నిర్ణయాలను మోహన్ బాబు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈమధ్య కాలంలో మంచు విష్ణు నటిస్తూ, నిర్మించిన ‘మోసగాళ్లు’ ప్రమోషన్స్‌లో చిరు తన వంతు సాయం చేశారు.
రీసెంట్‌గా మోహన్ బాబు నటిస్తున్న ‘సన్నాఫ్ ఇండియా’ టీజర్, చిరు రిలీజ్ చేసి, విషెస్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిరు సోదరుడు నాగబాబు, ప్రకాష్ రాజ్‌కి మద్దతు ఇవ్వడం ఏంటి.. మెగాస్టార్ మంచు విష్ణును సపోర్ట్ చేస్తారా..? అంటూ ఫిలిం వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
ప్రకాష్ రాజ్ హామీలు..
వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్.. ఇప్పటివరకు ‘మా’ అసోసియేషన్‌కు సొంత భవనం లేదని, తాను అధ్యక్షుణ్ణి అయితే సొంత భవనం నిర్మిస్తానని, ‘మా’ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. చిరంజీవి మద్దుతు గురించి మాట్లాడుతూ.. ‘అన్నయ్య ఎవరికీ మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారు అనుకునే వారికి ఆయన మద్దతు తప్పకుండా ఉంటుంది’ అన్నారు.