Today Headlines: 27మందితో వైసీపీ రెండో జాబితా విడుదల
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది.

Today Headlines in Telugu at 11PM
వైసీపీ సెకండ్ లిస్ట్..
ఇప్పటికే 11 చోట్ల మార్పులతో వైసీపీ తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి రెండో జాబితా వచ్చేసింది. 27 మంది ఇంఛార్జ్ లతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది వైసీపీ.
సమ్మె విరమించిన ట్యాంకర్ల డ్రైవర్లు.. పెట్రోల్ బంకుల్లో ఎలాంటి షార్టేజ్ లేదు
పెట్రోల్ బంకుల్లో ఎలాంటి షార్టేజ్ లేదని తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ట్యాంకర్ల డ్రైవర్లు నిన్న సమ్మె చేశారని.. ఈరోజు వారితో మాట్లాడి సమ్మె విరమింపజేశామని చెప్పారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారని, దీంతో గందరగోళం నెలకొందని వివరించారు. ఈరోజు రాత్రి వరకు అన్ని బంకులకు స్టాక్ వస్తుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల ఆందోళన.. స్పందించిన కేంద్రం
దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ట్రక్ డ్రైవర్స్ యూనియన్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సమావేశం కానున్నారు. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు కఠిన శిక్షలు జరిమానాలు ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ట్రక్ డ్రైవర్ల ఆందోళనతో దేశవ్యాప్తంగా సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు.
వైపీసీకి దాడి వీరభద్రరావు రాజీనామా
అనకపల్లి జిల్లాలో వైపీసీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డికి ఆయన పంపారు. దాడి వీరభద్రరావు జనసేన పార్టీలో చేరే అవకాశముందని సమాచారం.
సింగరేణి సీఎండీ బదిలీ ..
సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్‌కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రాణాలు తీసిన భూకంపం..
జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా ప్రిఫిక్షర్ సమీప ప్రాంతాల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ మీడియా వెల్లడించింది. అందులో ఇషికావా నగరంలోనే అత్యధిక మంది మరణించినట్లు పేర్కొంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
హెడ్ కానిస్టేబుల్ మృతి..
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. విధుల్లో ఉండగా బీపీ ఎక్కువై చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు మృతిచెందారు. మృతుడు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా బీపీ పెరగడంతో కిందపడిపోయాడు. గుర్తించిన సహచరులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
హైకోర్టులో విచారణ..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగంచేసి అనుచిత లబ్ది పొందారని రఘురామ పిటీషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 23 న విచారణ అర్హతలపై వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.
నిలిచిన విమానం.. ప్రయాణికుల ఆందోళన..
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కోల్ కత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. మరో విమానంలో పంపించకపోగా, తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రయాణికులు రన్‌వేపై ఆందోళనకు దిగారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది వారికి మరో విమానంలో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ గూటికి షర్మిల..
వైఎస్ షర్మిల ఈనెల 4న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. మరికొద్ది సేపట్లో ఇడుపుల పాయలో షర్మిల ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పదవి అప్పగిస్తారా? అనే అంశంపై స్సపెన్షన్ కొనసాగుతోంది. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి వైపు రాహుల్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ, సిడబ్ల్యుసి లో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్న కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆరో్గ్య సురక్ష..
రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. ఇవాళ్టి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. వారానికి రెండు రోజుల చొప్పున (మంగళ, శుక్రవారాల్లో) జేఎన్ఎస్ ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో మాత్రం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
రేపు పీసీసీ సమావేశం..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ మొదటి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, ప్రదేశ్ ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీలసభ్యులు, మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు.
నేడు ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ ..
భారత్ మహిళల జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య ఇవాళ మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్లు ఆఖరి పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో అయినా విజయం సాధించి ఒక్క విజయంత అయినా ఊరట పొందాలని హర్మన్ ప్రీత్ కౌర్ బృందం భావిస్తోంది.
విమర్శలకు స్పందించం..
జమ్మూ కశ్మీర్ కు వర్తించే ఆర్టికల్ 370 రద్దుపై ఇచ్చిన తీర్పు మీద వచ్చే విమర్శలకు స్పందించబోమని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయమూర్తులు రాజ్యాంగం, చట్టాల ప్రకారమే తీర్పులు ఇస్తుంటారని తెలిపారు.
సుప్రీంలో పిటిషన్ ..
న్యాయ శిక్షాస్మృతుల్లో మార్పులకు పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నూతన చట్టాల్లో అనేక లోపాలు, వ్యత్యాసాలు ఉన్నాయని, అందువల్ల అవి అమల్లోకి రాకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ విశాల్ తివారీ అనే న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్ ) దాఖలు చేశారు. విపక్ష ఎంపీల్లో పలువురిని సస్పెండ్ చేసి మూడు బిల్లుల్ని పార్లమెంట్ లో ఆమోదించారని, తగినంత చర్చే జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
సమ్మెలో డ్రైవర్లు..
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇంధన లారీలు, ట్యాంకర్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం చర్లపల్లి పారిశ్రామిక వాడలోని వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెలోకి దిగారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ, మరికొన్ని రాష్ట్రాలకు వాటి సరఫరా ఆగిపోయింది.