Today Headlines: అంగన్‌వాడీల సమ్మెపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

జైలుకైనా పోతామంటూ కొందరు అంగన్ వాడీ వర్కర్ల సంఘం నేతలు అంటున్నారు. కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయి. మేము వారికి చేయాల్సింది చేశాం.

Today Headlines: అంగన్‌వాడీల సమ్మెపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

11PM Headlines

Updated On : January 8, 2024 / 11:02 PM IST

అంగన్‌వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం..
అంగన్ వాడీల సమ్మె, వేతనాల పెంపు డిమాండ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంగన్ వాడీల వేతనాలు పెంచలేము అని సజ్జల తేల్చి చెప్పారు. వేతనాలు పెంచలేము కాబట్టే చేయలేమని చెబుతున్నామన్నారు. ఎన్నికల అనంతరం అప్పటి పరిస్థితులను బట్టి వేతనాల పెంపు చూస్తామని క్లారిటీ ఇచ్చారు సజ్జల. అంగన్ వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు సజ్జల.

సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం
మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది.
ఆ నలుగురు ఎమ్మెల్యేలు
మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి
కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి
ఆనం నారాయణరెడ్డి
ఉండవల్లి శ్రీదేవి

ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు
సీ రామచంద్రయ్య
వంశీకృష్ణ యాదవ్‌

వీరి ఈర్ష్య, అసూయ శిఖర స్థాయికి చేరుకుంది: బండ్ల గణేశ్

తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచనల కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బండ్ల గణేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్నటితో ప్రజా పాలన 30 రోజులు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. మిగతా రాష్ట్రాలన్నీ మెచ్చుకునేలా ప్రజాపాలన కొనసాగుతుంటే కేటీఆర్, హరీశ్ రావు ఈర్ష్యా, అసూయ శిఖర స్థాయికి చేరుకుందని బండ్ల గణేశ్ అన్నారు. ‘వందరోజుల తర్వాత పప్పులు ఉడుకుతాయని అంటున్నారు.. పప్పులు ఉడకడం కాదు.. బిర్యానీ కూడా ఉడుకుతుంది హరీశ్ రావు’ అంటూ బండ్ల గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాపై కుట్రలు పన్నుతున్నారు: రాచమల్లు

రాజకీయంగా, భౌతికంగా తనను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆస్ట్రేలియా సంస్థతో కొందరు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని చెప్పారు.

నెగ్గిన అవిశ్వాస తీర్మానం ..
నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి 41 ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమ ఉజ్జీలుగా కౌన్సిలర్లను గెలుచుకున్నా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లతో బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డిని చైర్మన్ అయ్యారు. కానీ, ఎన్నికల ముందే బీఆర్ఎస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.

వికలాంగుడికి బాలయ్య హామీ ..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. ఆయన నివాసం వద్ద బాలయ్యను చూడటానికి అభిమానులు పోటెత్తారు. పుట్టపర్తికి చెందిన వికలాంగుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయ నాయుడును బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. మోకాళ్లపై కూర్చొని వికలాంగుడైన రామాజనేయ నాయుడుకు బాలకృష్ణ శాలువా కప్పారు. రామాంజనేయులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జీవనాధారం ఎట్ల, పెన్షన్ 3వేలు సరిపోతుందా? అని బాలయ్య అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కోసం ఫుల్ టైమ్ వర్కర్ గా పనిచేస్తున్నాను.. నాకు ఏదైనా న్యాయ చేయమని బాలయ్యను వికలాంగుడు రామాంజనేయ నాయుడు
కోరారు. కచ్చితంగా పార్టీకోసం నీవు చేసిన కష్టాన్ని గుర్తించి తగు న్యాయం చేస్తానని వికలాంగుడికి బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.

కారు బీభత్సం ..
కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ రాంగ్ రూట్‌లో అతివేగంగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

కులగణన సర్వే ..
ఈనెల 19 నుంచి ఏపీలో కులగణన సర్వే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 20 అంశాలకు సంబంధించిన వివరాలను వాలంటీర్లు సేకరించనున్నారు. ఇప్పటికే రెండు సార్లు కులగణన సర్వే వాయిదా పడిన విషయం తెలిసిందే.

బంగ్లాపీఠంపై మరోసారి హసీనా..
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి విజయం సాధించింది. ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 300 సీట్లలో 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ 200 సీట్లను కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. గోపాల్ గంజ్ -3 నుంచి పోటీ చేసిన ప్రధాని హసీనా 2,49,965 ఓట్లు సాధించారు.

ఏపీలో కో-ఆర్డినేటర్లు ..
ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ కో- ఆర్డినేటర్లను నియమించింది.