Today Headlines: దమ్ముంటే.. వైసీపీ ఎమ్మెల్యేకి దేవినేని ఉమ సవాల్

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Today Headlines: దమ్ముంటే.. వైసీపీ ఎమ్మెల్యేకి దేవినేని ఉమ సవాల్

Today Headlines in Telugu at 11PM

Updated On : January 9, 2024 / 10:57 PM IST

ముఖ్యమంత్రి, మంత్రులకే పరువు లేదు..
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీమంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వసంత కృష్ణప్రసాద్ కి సలహా ఇస్తున్నా.. దమ్మూ ధైర్యం ఉంటే అడ్వకేట్ కమీషన్ వేయించు అని దేవినేని ఉమ అన్నారు. నీ అవినీతి చిట్టా మొత్తం కోర్టు ముందు, ప్రజల ముందు ఉంచుతాం అని తేల్చి చెప్పారు. ప్రకృతి సంపద దోచుకున్న ఎమ్మెల్యే నువ్వు.. నా మీద పరువు నష్టం దావా వేస్తావా? ముఖ్యమంత్రి, మంత్రులకే పరువు లేదు. నేను నీకు క్షమాపణ చెప్పాలా? అంటూ నిప్పులు చెరిగారు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరావు.


కళ్యాణదుర్గం నుంచే పోటీ- ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

మాజీమంత్రి రఘువీరా రెడ్డితో వైసీపీకి గుడ్ బై చెప్పిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబంతో కలిసి పూజలు చేశారు కాపు రామచంద్రారెడ్డి. ఆ తర్వాత మాజీమంత్రి రఘువీరారెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు 2గంటల పాటు సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. 2009 నుంచి తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రఘువీరారెడ్డితో అనుబంధం ఉందని కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. వైసీపీని వీడిన రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు.

చంద్రబాబు అబద్దాలు చెప్పడం బాధ కలిగించింది-చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబుకు చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించడం తగదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు. లక్ష దొంగ ఓట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఫిర్యాదుపై న్యాయపోరాటం చేస్తామని మోహిత్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు తనకు తాత సమానులు అని, అలాంటి వ్యక్తి ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం బాధ కలిగిస్తుందన్నారు మోహిత్ రెడ్డి.

నిందితుడిని పట్టించిన చెప్పు..
హైదరాబాద్ ఓయూ లేడీస్ హాస్టల్ లో అక్రమంగా చొరబడిన అగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 1న లేడీస్ హాస్టల్ కి చొరబడ్డాడు అగంతకుడు. చెప్పు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఓయూలోని బస్తీకి చెందిన యువకుడు రాజుగా గుర్తించారు. అతడు ఓయూ కిన్నెర హాస్టల్ లో గతంలో పని చేశాడు. జనవరి 1న అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ లో కి దూరి అల్లరి చేశాడు. నిందితుడు వదిలి వెళ్ళిన చెప్పు ఆధారంగా ఓయూ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

జగన్.. నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు..
తాను సీఎం జగన్ ను ఒక్క మాట కూడా అనలేదని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. నేను అన్న మాటలు సీఎం జగన్ కు ఆపాదించి ప్రచారం చేశారని వాపోయారు. నేను మాట్లాడింది పార్టీకి, సీఎం జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు. మా రాజకీయ భవిష్యత్తు జగన్ తోనే ఉంటుందన్నారు. సీఎం జగన్ పై నమ్మకంతోనే అయన వెంట నడుస్తున్నాం అన్నారు. జగన్ నన్ను సొంత చెల్లిలా చూసుకున్నారు అని చెప్పారు. నేను ప్రశ్నించింది అధికారులను, సీఎం జగన్ ను కాదు అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వివరించారు.

ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి అంబటి రాంబాబు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీని కొనటానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఓడిపోతారు అని అన్నారు. మాకు దొంగ ఓట్లు అవసరం లేదన్న అంబటి రాంబాబు.. జగన్ ని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు ప నిచేయవు అని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఓటమి భయంతో వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ మాజీ సీఎం అవుతారు-కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ మాజీ సీఎం అవుతారని ఆయన చెప్పారు. ఎంతోమంది దేశాధినేతలు నేను అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం నాకు అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని వాపోయారు. నాకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని పాల్ వ్యాఖ్యానించారు.

సీటుపై స్పష్టత ఇవ్వనున్న సీఎం జగన్
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేరుకున్నారు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మా కాలువల నుంచి మేము తాగునీటి విడుదల కోసం సీఎంవో నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్ బుక్ ద్వారా సీఎంవోపై విమర్శలు చేయడంతో సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. తన వ్యాఖ్యలపై సీఎంకు వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో సీటు విషయంపైనా సీఎం జగన్ ఆమెకు స్పష్టత ఇవ్వనున్నారు.

మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ను అరెస్ట్ చెయ్యొద్దన్న హైకోర్టు
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17న పోలీసుల ముందు హాజరు కావాలని సాహిల్‌ను హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో సాహిల్ వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఈనెల 24 కు వాయిదా వేసింది. పంజాగుట్ట కారు ప్రమాద ఘటన కేస్ డైరీని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

రేవంత్ తో జగ్గారెడ్డి భేటీ ..
జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. వీరి సమావేశం సుమారు 20 నిమిషాలపాటు సాగింది. రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు.

టీడీపీ అనర్హత పిటీషన్ ..
పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై టీడీపీ అనర్హత పిటీషన్ ఇవ్వనుంది. టీడీపీ నుంచి వైకాపాలో చేరిన వారిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ లు ఉన్నారు. ఆ నలుగురు వైసీపీలో ఉన్నారనే అంశంపై ఆధారాలు స్పీకర్ కు టీడీపీ ఇవ్వనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వీలైనంత త్వరగా నోటీసులు ఇవ్వాలని టీడీపీ కోరనుంది.

ఇరిగేషన్ కార్యాలయంలో తనిఖీలు..
హైదరాబాద్ లోని ఇరిగేషన్ కార్యాలయం జలసౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని ఫోర్లను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అధికారులు, సిబ్బంది ఫోన్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీస్ లోని అన్ని ఫైల్స్, రికార్డులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

అరవింద్ కుమార్ పై సీరియస్ .. 
అరవింద్ కుమార్ ఐఏఎస్ పై రేవంత్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫార్ములా ఈ- రేస్ ఒప్పందం ఉల్లంఘించి 54కోట్లను అరవింద్ కుమార్ విడుదల చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో అరవింద్ కుమార్ కు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి మెమో జారీ చేశారు. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. గ్రీన్ కోను తప్పించి ఎఫ్ఐఏతో ఎందుకు ఒప్పంద చేశారని ప్రభుత్వం ప్రశ్నించింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని మెమోలో ప్రభుత్వం పేర్కొంది.

అమెరికాలో కలకలం ..
అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం వెలుపలి గేటును ఓ వ్యక్తి వాహనంతో ఢీకొట్టాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6 గంటలకు చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటన ట్రాఫిక్ సమస్య కారణంగా జరిగిందా.. ఉద్దేశపూర్వకంగా చేసిందా అనే కోణంలో భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. వాహన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో లేరు.

పోటాపోటీ సమావేశాలు..
శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పోటాపోటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకవైపు మంత్రి పెద్దిరెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఏడు పంచాయతీల్లో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించి సమావేశాలు నిర్వహించగా.. బాలకృష్ణ వార్డుల వారిగా సమావేశాలు నిర్వహించారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం..
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి రాజీవ్ రెడ్డి అనే ఇంజనీర్ మృతి చెందాడు. రాజీవ్ ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ సిడిపి చైర్మన్ భూపాల్ రెడ్డి కుమారుడు. గత ఐదేళ్లుగా టెక్సాస్ లో ఉంటూ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితమే రాజీవ్ కి వివాహం జరిగింది. నాలుగు నెలల క్రితమే రాజీవ్ అమెరికాకు భార్యను తీసుకెళ్లాడు.

సీఈసీతో చంద్రబాబు, పవన్ భేటీ ..
కేంద్ర ఎన్నికల కమిషన్ బృందంతో ఇవాళ విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫాం-7 దరఖాస్తుల అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఎన్నికల విధుల్లో వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని కోరనున్నారు.

అసెంబ్లీ సమావేశాలు..
వచ్చే నెల మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఓటాన్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

జనసేన పార్టీలో చేరికలు .. 
ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసిన పలువురు ప్రముఖులు సోమవారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ మంచి శివశంకర్, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు గువ్వల శ్రీనివాసులు, కొమ్మినేని చిన్నపురెడ్డిలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వారికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతంకోసం కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో సమర్ధంగా పని చేయాలని సూచించారు.