టాలీవుడ్‌ను వీడని కరోనా భయం, ఆగస్టు వరకు ఆగాల్సిందే అంటున్న స్టార్ హీరోలు

టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ముందుగా ఏ సినిమా షూటింగ్ స్టార్ట్

  • Published By: naveen ,Published On : June 19, 2020 / 04:49 AM IST
టాలీవుడ్‌ను వీడని కరోనా భయం, ఆగస్టు వరకు ఆగాల్సిందే అంటున్న స్టార్ హీరోలు

టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ముందుగా ఏ సినిమా షూటింగ్ స్టార్ట్

టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ముందుగా ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు? ఏ స్టార్ హీరో తొలుత మేకప్ వేసుకుంటాడు? ఇప్పుడీ ప్రశ్నలు సినీ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు టాలీవుడ్ లో సినిమా షూటింగ్ ల సందడి ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనికి సమాధానంగా ఆగస్ట్ అనే మాట వినిపిస్తోంది. ఆగస్టులో అసలు సందడి ప్రారంభం అవుతుందనే సమాధానం చిత్ర పరిశ్రమ నుంచి వస్తోంది. దీనికి కారణం కరోనా భయం. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడానికి నటీనటులు సాహసం చేయాలని అనుకోవడం లేదు. అందుకే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఆగస్టు నాటికి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్న నటీనటులు అప్పటి నుంచి షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నారట.

ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ధైర్యం చాలడం లేదు:
కరోనా లాక్ డౌన్ కారణంగా టీవీ, సినిమాల షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల తర్వాత లాక్ డౌన్ 5లో సడలింపులు ఇవ్వడంతో సినిమా, టీవీ షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా సినిమా చిత్రీకరణలు ఇంకా ఊపందుకోలేదు. చిత్ర పరిశ్రమ ఇప్పటికీ ధైర్యంగా అడుగు వేయలేకపోతోంది. లాక్‌డౌన్‌ తరహాలోనే ఇప్పుడు కూడా నటీనటులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొన్నాళ్లు బయటికి రాలేమనే సంకేతాలు ఇస్తున్నారు. దర్శక నిర్మాతలు కలిసి సినిమాల్ని పట్టాలు ఎక్కించడానికి చేస్తున్న సన్నాహాలు… కొన్ని సినిమాల నిర్మాణానంతర పనులు మినహా చిత్ర పరిశ్రమలో సందడేమీ లేదు. ఒకట్రెండు పరిమిత వ్యయంతో కూడిన చిత్రాలు తప్ప మిగతావి పునః ప్రారంభం కాలేదు. మెజార్టీ స్టార్ నటులు ఆగస్టు నుంచి రంగంలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారట. కాబట్టి అసలు సిసలు సందడి అప్పట్నుంచే మొదలుకానుందని ఫిలింనగర్ సమాచారం.

సాహసం చేయడం కన్నా మరికొన్నాళ్లు ఇంట్లో ఉండటమే మేలు:
థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. తెరుచుకున్నా ప్రేక్షకులు వస్తారో లేదో అనే సందేహం వెంటాడుతోంది. సినిమాల్ని ఇప్పటికిప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్నా వాటితో పెద్దగా ప్రయోజనమేమీ లేదు. పైగా కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాహసం చేసి సెట్లోకి దిగడం కంటే మరికొన్నాళ్లు వేచి చూడటమే మేలన్న ధోరణిలో చిత్ర పరిశ్రమ కనిపిస్తోంది. ఫలితంగా చిత్రీకరణలు  వాయిదా పడుతూనే ఉన్నాయి.

మొదట షూటింగ్ స్టార్ట్ అయ్యే సినిమాలు అవే అనుకున్నారు:
సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ముందుగా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘ఆచార్య’ సినిమాల షూటింగ్ లు ప్రారంభం అవుతాయని సంకేతాలు వచ్చాయి. వాటిని మిగతా చిత్రాలు అనుసరించేలా కనిపించింది. కట్ చేస్తే, ఇప్పటికీ అవి ఆరంభం కాలేదు. కరోనా విజృంభణ, నిబంధనల పరంగా తలెత్తుతున్న సమస్యల కారణంగా ఈ సినిమాలు సెట్స్‌ పైకి వెళ్లడానికి సమయం పడుతుందని సమాచారం. తుదిదశకు చేరుకున్న సినిమాలు పూర్తి చేయడానికి ఇంకా సన్నాహాల్లోనే ఉన్నాయి.  

కరోనా కారణంగా డబుల్ ఖర్చులు:
అసలు ఇప్పటిదాకా ఆరంభం కాని సినిమాలు మాత్రం మరింత ఆలస్యంగా సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. కొద్దిమంది హీరోలు చిత్రీకరణలకి సుముఖంగానే ఉన్నప్పటికీ… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తారలు, సాంకేతిక నిపుణులు, వాళ్ల బస, ప్రయాణాల విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. పరిమిత సిబ్బందితో చిత్రీకరణలూ కష్టతరమే. దాంతో కరోనా తీవ్రత తగ్గేవరకు వేచి చూడటమే మేలని దర్శకనిర్మాతలు, నటీనటులు భావిస్తున్నారు. కొంతమంది తారలేమో కరోనా తగ్గినా తగ్గకపోయినా ఆగస్టు నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందుకే దర్శకనిర్మాతలు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

‘‘ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో షూటింగ్ లు అనుకున్నా, అందుకోసం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలు పెట్టాలి. అప్పట్లోపు ఇతర నటీనటుల్ని, సాంకేతిక బృందాన్ని ఒక చోటకి తీసుకురావాలి. లొకేషన్లు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేయాలి. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు ప్రతి విషయంలోనూ రెండింతల ప్రయాస ఎదురవుతోంద’’ని షూటింగ్ ల కోసం ఏర్పాట్లలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాత చెప్పారు. మొత్తంగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు ఇప్పుడే ప్రారంభమయ్యే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. కరోనా తీవ్రత తగ్గాకే రంగంలోకి దిగాలని నటీనటులు అనుకుంటున్నారు. సో, సినీ అభిమానులూ.. ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే. కాగా, అప్పటికైనా షూటింగ్ లు స్టార్ట్ అవుతాయో మరోసారి వాయిదా వేస్తారో చూడాలి.

Read: సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్