కరోనా కట్టడికి సరికొత్త బైక్ సృష్టించాడు.. భౌతిక దూరానికి ఆయుధమన్నాడు!

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 07:57 AM IST
కరోనా కట్టడికి సరికొత్త బైక్ సృష్టించాడు.. భౌతిక దూరానికి ఆయుధమన్నాడు!

Updated On : May 3, 2020 / 7:57 AM IST

అతడు స్కూల్ డ్రాపవుట్. అంటే స్కూల్ విద్య కూడా పూర్తి కాలేదు. పైగా మెకానిక్. అయితేనేం హైలీ టాలెంటెడ్. అదిరిపోయే క్రియేటివిటీ అతడి సొంతం. ఇప్పుడీ మెకానిక్ న్యూస్ లోకి ఎక్కాడు. అతడు రూపొందించిన బైక్ అందరి దృష్టి అట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ ఈ బైక్ స్పెషల్ ఏంటో తెలుసా, ఇది కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో తోడ్పడుతుంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే సోషల్ డిస్టెన్స్(భౌతిక దూరం చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మెకానిక్ ఈ బైక్ తయారు చేశాడు. బండి నడిపే వ్యక్తికి వెనుక కూర్చునే వారికి భౌతిక దూరం ఉండేలా దీన్ని రూపొందించాడు.

బ్యాటరీ సాయంతో నడిచే బైక్:
అతడి పేరు పార్థా సాహా. వయసు 39 ఏళ్లు. త్రిపురలో ఉంటాడు. సాహా ఓ తుక్కు వ్యాపారి నుంచి పాత బైక్ కొన్నాడు. దాని నుంచి ఇంజిన్ తీసేశాడు. మెషిన్ ను కట్ చేశాడు. ఆ తర్వాత మీటర్ పొడవు ఉండే రాడ్ తో రెండు చక్రాలను కలిపాడు. బ్యాటరీ సాయంతో నడిచే మోటార్ సైకిల్ తయారు చేశాడు. ఇప్పుడీ ఈ బైక్ ద్వారా నేను నా కూతురు సురక్షిత దూరం మెయింటేన్(భౌతిక దూరం) చేస్తూ ప్రయాణం చేస్తున్నామని సాహా చెప్పాడు.

ఈ బైక్ వాడితే కరోనా రాదు:
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్. మానవళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అదే సమయంలో ప్రజలు మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. కరోనాను కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించడం తప్ప మరో మార్గం లేదు. లాక్ డౌన్ సడలించాక భౌతిక దూరం చాలా అవసరం కానుంది. దీన్ని గ్రహించిన సాహా కరోనాపై పోరులో తన వంతు పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనతోనే సరికొత్త బైక్ ను రూపొందించాడు.

లాక్ డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి బైక్ లే అవసరం అవుతాయేమో:
కాగా ఈ మెకానిక్ బాగా డబ్బున్నవాడేమీ కాదు. ఓ సాధారణ కుటుంబం. తన దగ్గర దాచుకున్న కొంత డబ్బుతోనే ఈ బైక్ ను తయారు చేశాడు. లాక్ డౌన్ సడలించాక తన కూతురిని స్కూల్ కి తీసుకెళ్లడానికి, తిరిగి ఇంటికి తీసుకురావడానికి ఈ బైక్ ని వినియోగిస్తానని సాహా చెప్పాడు. ఈ బైక్ బ్యాటరీ తో పని చేస్తుంది. గంటకు 40 కిమీ వేగంతో వెళ్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ కు 3 గంటలు పడుతుంది.
Social Distancing Bike

ఒక్కసారి ఫుల్ గా చార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఛార్జింగ్ కు రూ.10 ఖర్చు అవుతుంది. ఈ మెకానిక్ అద్భుత సృష్టిని అంతా ప్రశంసిస్తున్నారు. అతడి సృజనాత్మకతను త్రిపుర సీఎం బిపాల్ దేవ్ సైతం ప్రశంసించారు. ప్రత్యేకమైన మోటార్ సైకిల్ ను తయారు చేసిన సాహాను అభినందిస్తున్నా. కరోనాపై ప్రజలకు చైతన్యం కల్పించేలా, భౌతిక దూరం ఆవశ్యకతను తెలియజేసేలా సాహా చేసిన బైక్ నిజంగా అద్భుతం అని ట్వీట్ చేశారు. 

ప్రస్తుతం వాడుకలో ఉన్న బైక్ లపై సోషల్ డిస్టేన్స్ అసాధ్యం. అందుకే బైక్ పై కేవలం ఒకరు మాత్రమే వెళ్లడానికి పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాహా తయారు చేసిన బైక్ చాలా కీలకంగా మారనుంది. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో ఇలాంటి బైక్ ల అవసరం చాలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.