AP 10Th Exams: టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతాం- మంత్రి ఆదిమూలపు!
కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేయగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణతో..

Ap 10th Exams
AP 10Th Exams: కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యార్థుల పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేయగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దుచేసి అందరూ పాసైనట్లుగా ప్రకటించారు. అయితే, ఏపీలో మాత్రం ప్రసుత్తానికి టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయగా ఈ పరీక్షలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఏది ఏమైనా పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం బల్లగుద్ది చెప్తుంటే.. పిల్లలతో పాటు తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడేందుకు ప్రభుత్వానికి హక్కు ఎవరిచ్చారని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా అధికార పక్షం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఈ పరీక్షలను నిర్వహించి తీరుతామని, రద్దు చేసే ప్రసక్తే లేదని ఏపీ విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేయగా ఇప్పుడు మరోసారి కూడా అదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను వైరస్ ప్రభావం కాస్త తగ్గక నిర్వహిస్తామని అప్పటి వరకు విద్యార్థులు సమాయత్తమవ్వాలని కోరారు. పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు మాత్రమే కోరుతున్నారని వెల్లడించిన ఆయన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరూ పరీక్షలను రద్దు చేయాలని కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. పరీక్షల రద్దు కోసం ప్రతిపక్షాలు చేసేవన్నీ అనవసర రాద్ధాంతాలేనని మంత్రి ఆదిమూలపు విమర్శించారు.