సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్.. 45 రోజులు నో షుగర్ ఛాలెంజ్ అట.. ఓకే అనేముందు ఒకసారి ఈ స్టోరీ చదవండి..

45 రోజులు నో షుగర్ ఛాలెంజ్. సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. దీని వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఛాలెంజ్‌కు తీసుకుని పాటించే వారు బీపీ కంట్రోల్ అవుతుందని, కొవ్వును తొలగించుకోవచ్చని చెబుతున్నారు. ఇది నిజమేనా? అసలు షుగర్ తీసుకోకపోతే మన బాడీ తట్టుకుంటుందా? బాడీలో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి? అనే దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి.
దీనికి సంబంధించి డాక్టర్లు చెబుతున్నది ఏంటంటే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సూచనల ప్రకారం, సాధారణ వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల (సుమారు 10 గ్రాముల) చక్కెర తీసుకోవడం సరైనది. డయాబెటిస్, ఊబకాయం, కొవ్వుతో సంబంధమైన వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో షుగర్ ఫ్రీ జీవనశైలి అనేది ఇంట్రస్టింగ్ గా అనిపించడం సహజమే. అయితే, కేవలం షుగర్ తీసుకోవడం మానేసినంత మాత్రాన సంతులిత ఆహారం లభిస్తుందని అనుకోవడం తప్పు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
బియ్యం లేదా చపాతీ కూడా ఒక విధంగా చక్కెర మాదిరిగానే పనిచేస్తాయి. కేవలం షుగర్ మానేయడం కాకుండా, ఎక్సర్ సైజ్, సరైన ఆహారం కూడా చాలా అవసరం. ఎంత షుగర్ తీసుకోవాలనేదానిపై అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. మనం చక్కెరను ఎలాంటి రూపంలో తీసుకుంటున్నామో తెలుసుకోవాలి. అలాగే మనం తీసుకునే కార్బోహైడ్రేట్ల రకం కూడా ముఖ్యం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు తీసుకుంటే అవి శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతాయి
షుగర్‌కు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడొచ్చుకదా అనే అభిప్రాయం కూడా ఉంటుంది. అయిత, అది కూడా మన శరీరంలో షుగర్‌లాగే జీర్ణమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి ఛాలెంజ్ లు చేయడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. చాలా సందర్భాల్లో డైటిషియన్ లేదా డాక్టర్ సలహా లేకుండానే ఇష్టం వచ్చినట్టు డైట్స్ ప్రారంభిస్తారు. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.