Colon Cancer : మలద్వారం నుండి రక్తం! పెద్ద పేగు క్యాన్సర్ కావొచ్చేమో?
పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే వారికి ఎడమవైపునా మళ్లీ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Colono Cancer
Colon Cancer : కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది జీర్ణవ్యవస్థ యొక్క దిగువ చివర ఉన్న పెద్దప్రేగుకు వచ్చే క్యాన్సర్. దీనిని పెద్దప్రేగు లేదా మల క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్ ఇది. దాదాపు 1.4 మిలియన్ కొత్త కేసులు, సంవత్సరానికి 694,000 మరణాలు సంభవిస్తున్నాయి. కొలొరెక్టల్ క్యాన్సర్స్ కేసులు విసృతంగా పెరుగుతున్నాయి. వీటిని ముందస్తుగా గుర్తించడం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండగా, భారతదేశంలో ఇది విపరీతంగా పెరుగుతోంది. కొలొరెక్టల్ క్యాన్సర్ నివారించదగిన క్యాన్సర్లలో ఒకటి. సాధారణ స్క్రీనింగ్‌తో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా వ్యాధి నుండి బయటపడవచ్చు.
మన జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు కీలకమైన విధులు నిర్వహిస్తుంటుంది. ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను అది గ్రహించి శరీరానికి అందిస్తుంది. దాంతోపాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించివేస్తుంది. ఇంతటి కీలకమైన పెద్దపేగును వైద్యపరిభాషలో కోలన్ అంటారు. పొత్తికడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, మలద్వారం నుంచి రక్తం పడటం వంటివి కోలన్ క్యాన్సర్‌కు ప్రధాన లక్షణాలు. చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోక మొలల సమస్యగా భావిస్తారు. పెద్దపేగు క్యాన్సర్‌ను అనుమానించకపోవడం వల్ల వ్యాధి ఎక్కువగా ముదిరాక డాక్టర్‌ను సంప్రదించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు ;
పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారికి కనిపించే ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. విపరీతమైన మలబద్దకం ఉండటం, మరికొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటడం, ఈ రెండు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి. పొట్ట కింది భాగంలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం. అకారణంగా నీరసం, బరువు తగ్గడం. పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవారిలో అక్కడ ఉన్న అల్సర్లు, మ్యూకస్ పొర నుంచి రక్తస్రావమై… అది మలంతో పాటు బయటకు వస్తూ ఉంటుంది. రోజూ రక్తం పోతూ ఉండటంతో శరీరంలో రక్తపరిమాణం తగ్గి నీరసం వస్తుంటుంది.
ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు 50 ఏళ్లు వచ్చే వరకు ఆగకుండా ముందునుంచే తరచూ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. కొందరి పెద్దపేగుల నిండా బొడిపెల వంటివి ఉంటాయి. వీటిని వైద్యపరిభాషలో ఫెమిలియల్ ఎడినమోటస్ పాలిపోసిస్ కోలీ అంటారు. మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే అలాంటి బొడిపెల కుటుంబ చరిత్ర ఉన్నవారి పిల్లలకూ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కొందరిలో పేగుల్లో వాపు, నొప్పి, మంటను కలిగించే ఇన్‌ఫ్లమేటరీ బవెల్డి సీజ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి వ్యాధులు ఉంటాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఈ సమస్యలు ఉన్నవారిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.
పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే వారికి ఎడమవైపునా మళ్లీ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయం ఉండటం, పీచు పదార్థాలు లేని జంక్‌ఫుడ్, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద పేగు క్యాన్సర్‌కు ముఖ్యకారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇతర క్యాన్సర్ల చికిత్స కోసం రేడియేషన్, కీమోథెరపీ తీసుకునే వారిలోనూ పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. డయాబెటిస్ ఉన్నవారిలోనూ పెద్ద పేగు క్యాన్సర్ రావచ్చు.
జాగ్రత్తలు ;
సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి కొన్ని సార్లు చిన్న వయసు వారిలోనూ వస్తుంది.మన ఆహారంలో ఆకుపచ్చటి తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు లాంటి పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకునే వారు చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. ఇక మాంసాహార ప్రియులు తమకు ఇష్టమైన మాంసాహారాన్ని తీసుకునే సమయంలో దానికి తగినట్లుగా అంతేమోతాదులో గ్రీన్‌సలాడ్స్ రూపంలో శాకాహారం తీసుకుంటూ మాంసాహారంతో వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. పొగతాగే అలవాటు,మద్యపానం అలవాటు మానేయాలి. పూర్తిగా వదిలేస్తేనే మంచిది. తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కోలన్ క్యాన్సర్‌కు చికిత్స అన్నది అది ఏ దశలో ఉందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. మొదటి దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స అందించటం శులభతరంగా ఉంటుంది.