ధారవిలో వైరస్ మాటు వేసింది.. చిక్కుల్లో ముంబై మహానగరం 

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 12:21 PM IST
ధారవిలో వైరస్ మాటు వేసింది.. చిక్కుల్లో ముంబై మహానగరం 

Updated On : April 4, 2020 / 12:21 PM IST

ధారవిలో చాలా ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమైతే ముంబై మహానగరం చిక్కుల్లో పడినట్టే. దీంతో ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం పారిశుద్ధ్యపనులు చేపట్టింది. శానిటైజేషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తోంది.

కరోనా వలయంలో ధారవి :
ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోన్న ధారవి ఇప్పుడు భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచమే కరోనా విలయంలో కకావికలం అయిపోతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో.. పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్ సోకడం, బెంగళూరులో పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు సరఫరా చేయలేదని వెల్లడి కావడంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. పేదలు పెద్ద సంఖ్యలో నివసించే ధారావిలో వైరస్ విస్ఫోటం జరిగితే ఊహించలేనంత పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశముంది. దీంతో అధికారులు ఆ మురికివాడపై స్పెషల్ ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. 

వైరస్‌తో చనిపోయిన వ్యక్తి ఇంటిని ఖాళీ చేయించి, ఆ ప్రాంతమంతా క్రిమిసంహారక మందులు చల్లారు. చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు, పక్కింటివాళ్లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఇరుకైన ఆవాసాల్లో, పరిశుభ్రతకు ఆమడదూరంలో ఉండే ధారవిలో ఏ మాత్రం అటు ఇటు అయినా మహా విపత్తు తప్పదు. ఈ విషయంలో ముంబై మహా నగర పాలక సంస్థ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆ ప్రాంతాన్ని నిత్యం పర్యవేక్షిస్తోంది.

ఏమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు నిర్వహించే చర్యలు తీసుకుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచేలా క్రిమిసంహారకాలను స్ప్రే చేయిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా సాధ్యమైనంత వరకూ దూరం దూరంగా ఉండాలని చెబుతోంది. కానీ, అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. జనం ఎక్కువ.. సదుపాయాలు తక్కువ. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులను అదుపులో ఉంచడం అధికార యంత్రాంగానికి కత్తి మీద సామే. 

చదువుకు దూరంగా చిన్నారులు :
ధారవిలోని పిల్లలు దాదాపుగా చదువుకు దూరంగా ఉంటారు. ఇక్కడ స్కూళ్లే తక్కువ. ఉన్న కొద్ది పాటి స్కూళ్లలో  చాలా తక్కువ సంఖ్యలో చిన్నారులు ఉంటారు. స్కూళ్లలో  చేరినా చదువు పూర్తి చేయరు. టెన్త్ వరకు రావడానికి ముందే చదువుకు ఫుల్ స్టాప్ పెడతారు. ఏదో ఒక కార్ఖానాలో కార్మికులుగా చేరిపోతారు. రాత్రి అయ్యేసరికి సేఠ్ అంతో
ఇంతో డబ్బులు పెడతాడు. పిల్లల సంపాదనపై తల్లిదండ్రులు కూడా ఆశలు పెట్టుకుంటారు. అంతేకాదు చాలా కుటుంబాల్లో పిల్లల సంపాదన లేకపోతే బండి నడవని పరిస్థితి ఉంటుంది. చిన్నారులు కార్మికులుగానే కంటిన్యూ అవుతారు. పెద్దయ్యాక కూడా కార్మికులుగానే బతికేస్తుంటారు.

విదేశాల నుంచి టూరిస్టులు :
ఈ మురికివాడను సందర్శించేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. ముంబయి మహానగరం నడిబొడ్డున ధారావి ఉంది. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్‌ షాపులు, మురికి కాల్వలతో నిండి ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు ఉన్నాయి. కానీ, పరిశుభ్రత ఉండదు. మురికి నీరంతా వీధుల్లో పారుతూ ఉంటుంది.

చాలామంది ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఎగుమతికి అనువైన, నాణ్యమైన తోలు ఉత్పత్తులు, కుండలు, ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేస్తుంటారు. చెత్త ఏరుకునేవారు, ట్యాక్సీ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇక్కడ నివసిస్తుంటారు. ఈ పూట గడిస్తే చాలు అన్నట్లుగా రోజూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవారు అనేకమంది ఉంటారు.

బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో స్లమ్‌ టూరిజం :
విక్టోరియా మహారాణి కాలం నుంచే ఇక్కడికి సందర్శకులు వస్తున్నారు. మొదట్లో వినోదం కోసం వచ్చేవారు. తర్వాత ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని చూసేందుకు, సామాజిక మార్పు కోసం వస్తున్నారు. వాస్తవానికి, ఈ పర్యాటక ధోరణిని చూస్తుంటే భారత్‌లో కొత్తగా అనిపిస్తుంది కానీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలలో ఎంతో కాలంగా ఇలాంటి స్లమ్ టూరిజం కొనసాగుతోంది. మురికివాడల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. పేదరికం గురించి పట్టించుకోవట్లేదు. అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు అనుమతించరు. కాబట్టి, వారి భావాలను అంచనా వేయడం చాలా కష్టం. అందరూ ఎవరి పని వారు చేసుకుంటారు.