Diwali 2023 : ఐదు రోజుల పండుగ దీపావళి .. ఏ రోజు ఏ విశేషమో తెలుసా..?

దీపావళిని ఐదు రోజులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు.ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ఈ ఐదు రోజులు ఐదు రకాలుగా ఈ పండుగను జరుపుకుంటారు.

Diwali 2023 : ఐదు రోజుల పండుగ దీపావళి .. ఏ రోజు ఏ విశేషమో తెలుసా..?

Diwali five days festival

Diwali five days festival : దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద తేడా లేకుండా ఆబాల గోపాలాన్ని అలరించే ఆనందాల పండుగ. ఈ పండుగను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఐదు రోజులు చేసుకుంటారు. సంక్రాంతి పండుగ మూడు రోజేలే కానీ.. దీపావళిని ఐదు రోజులు జరుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే కార్తీక మాసం ప్రారంభం దీపావళి మరునాటినుంచే ప్రారంభమవుతుంది కాబట్టి దీపావళిని కార్తీక మాసం అంతా  కూడా జరుపుకుంటారు.కార్తీయ మాసంలో సోమవారానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతీ సోమవారం సాయంత్రం పూజ తరువాత క్రాకర్స్ కాల్చుకుంటారు. ఉత్తర భారతంలో ప్రజలు  దీపావళిని ఐదు రోజులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అలా జరుపుకునే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ఈ ఐదు రోజులు ఐదు రకాలుగా ఈ పండుగను జరుపుకుంటారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు..నరకాసుర వధతో బాధలు పోయి ఆనందాలకు తెరదింపే ఈ దీపావళి పండుగకు ప్రతి ఇల్లు, వీధి, దేవాలయాలు దీపాల వెలుగులతో నిండిపోతాయి. అశ్వీయుజ బహుళ త్రయోదశి రోజు ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. మెుదటి రోజు ధన త్రయోదశి, రెండో రోజు నరక చతుర్దశి, మూడో రోజు దీపావళి, నాలుగో రోజు గోవర్ధన పూజ, ఐదో రోజు అన్నాచెల్లెళ్ల పండుగ. దాన్నే భగనీ హస్త భోజనం అంటారు.

Diwali 2023 : లక్ష్మీపూజలో ఐదు వత్తులు దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం, విశిష్టత

మొదటి రోజు..ధన త్రయోదశి
దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించిన రోజు కాబట్టి ఆరోజునే లక్ష్మీ దేవి పుట్టినరోజు అని చెప్పుకుంటారు. పాలసముద్రం నుంచి సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించి,ఆమె అనుగ్రహం పొందుతారు. ఆ రోజున ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది వర్ధిల్లి రెండింతలు మూడింతలు అవుతుందని నమ్ముతారు. అంటే అభివృద్ధికి నాంది పలుకుతుందని అంటారు.

రెండో రోజు : నరక చతుర్ధశి వెనుకున్న పురాణ కథ
అశ్వయుజ బహుళ చతుర్ధశిని నరక చతుర్ధిగా జరుపుకుంటారు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి సమయం కాని సమయంలో అంటే అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. నరకుడికి తల్లి చేతిలో తప్ప సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు చేతిలో కూడా చావు రాకుండా తల్లి వరం పొందుతుంది. దీంతో నరకాసురుడు అరాచకాలకు అంతులేకుండా ప్రవర్తిస్తుంటాడు. తల్లి బిడ్డను చంపదు కదా అనే అహంతో ఇష్టారాజ్యంగా అందరిని హింసిస్తుంటాడు.

మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. నరకాసురుడు దారుణాలను అంతమొందించేందుకు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామాతో కలిసి నరకుడిపై యుద్ధానికి వెళతాడు. కానీ కృష్ణుడికి తెలుసు..నరకుడిని తను వధించలేనని. ఆ యుద్ధంలో అపరిమితమైన బలంతో నరకుడు వేసిన బాణాలకు కృష్ణుడు మూర్ఛిల్లుతాడు. దీంతో సత్యభామ ఆగ్రహంతో నరకుడిపై యుద్ధానికి దిగుతుంది. కానీ తనబిడ్డనే తాను సంహరిస్తానని ఆమెకు తెలియదు. నరకుడికి తెలియదు ఆమె తన తల్లి అని..ఆమె చేతిలోనే తన మరణం తప్పదు అని. కృష్ణుడుకి తెలుసు సత్యభామ చేతిలోనే నరకుడు వధించబడతాడని. దీంతో అతను మూర్చిల్లినట్లుగా నటిస్తు రథంలో కూలిపోగా.. అస్త్ర శస్త్రాలతో భూదేవి అంశ అయిన సత్యభామ నరకాసురుని సంహరింస్తుంది. సత్యభామ అస్త్రాలకు నేలకూలిన నరకుడు ఆశ్చర్యపోతాడు. దీంతో కృష్ణుడు అసలు విషయం చెబుతాడు. తల్లి చేతిలోనే నీకు మరణం సంభవించబోతోంది అని..ఆ జన్మలో నీ తల్లే ఈనాడు సత్యభామగా పుట్టింది అని. దీంతో సత్యభామ తన పుత్రుడిని తన చేతులతో వధించానని తల్లడిల్లిపోతుంది..దానికి కృష్ణుడు ఆమెను ఊరడిస్తాడు. ఇది లోక కల్యాణం కోసం జరిగిందని ఓదారుస్తాడు. దీంతో సత్యభామ తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.

మూడో రోజు ..నరకుడి వధ దీపావళి వేడుక..
నరకాసురుడిని చంపిన మరుసటి రోజైన అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారు. ఆ రోజున ఇంటిని దీపాలతో అలంకరింస్తారు. తీపి పిండి వంటలు వండుకుని ..కొత్త బట్టలను ధరించి, టపాసులు కాలుస్తారు. అమావాస్య రోజున చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే ఒక ఆచారం ఉంది. ఆ రోజున పురుషులు పెద్దలకి జలతర్పణం విడుస్తారు. మహాలయ అమావాస్య రోజున స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పితృదేవతలు దీపావళి రోజున దీపాల వెలుగులో తిరిగి వెళ్ళిపోతారని చెబుతారు. అందుకే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం ఇంటి బయట దీపాలు వెలిగిస్తారు.

నాలుగో రోజు..గోవర్ధన పూజ
గోవర్థన గిరి అంటే అందరికి గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడే.ద్వారకలో  ఆయన పుట్టుక..పుట్టిన రోజునే గోకులం చేరిన కథలు తెలిసిందే. అతని చిలిపి చేష్టలు..లోక కల్యాణం కోసం కిట్టయ్య చేసిన పనులు.. పూతన వంటి రాక్షసులను సంహరించటం వంటి ఘనతలు కిట్టయ్య లీలల్లో ఎన్నో ఎన్నెన్నో..దీంట్లో భాగంగా గోకులంలో వర్షాలు భారీగా కురిసి గోకులం అంతా మునిగిపోతే గోవర్థన గిరిని ఎత్తి గోకులాన్ని కాపాడాడు కృష్ణుడు. అప్పటి వరకు గోకులవాసులంతా ఇంద్రుడినే కొలిచేవారంతా ఇక అప్పటింనుంచి తమ ఆపద్భాంధవుడు కృష్ణుడే అని నమ్మేవారు.  ఓ రోజున శ్రీకృష్ణుడు గోకుల వాసులను పిలిచి గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ.. ఈ రోజు నుంచి ఇంద్రుడిని పూజించడం మానేయండి. మనందరికీ పంటలు ఇచ్చేది.. మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే…దీనినే పూజించండి అని గోకులవాసులకు చెబుతాడు.

ఈ విషయం తెలిసిన ఇంద్రుడు గోకులంపై ఆగ్రహించి వరుణ దేవుడితో భారీ వర్షాలు కురిపిస్తాడు. దీంతో గోకులం అంతా వరద ముంచెత్తుతుంది. దీంతో కృష్ణుడు గోవర్థన గిరిని తన చిటికెన వేలితో ఎత్తి ఆ కొండ కింద అందరికి స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక బాలకుడు ఇదంతా చేశాడా..? అని దేవేంద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేయటంతో అతను సామాన్య బాలకుడు కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుంటాడు. వెంటనే శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుని క్షమిస్తాడు. అప్పటినుంచి నుంచి ‘ఇంద్రయాగం’ కాస్త ‘గోవర్ధనపూజ’గా మారిపోయింది.

Diwali 2023 : దీపాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? ఒక్కో పేరుకు ఒకో అర్థం

ఐదవ రోజు : అన్నాచెల్లెళ్ల పండుగ (భగినీ హస్త భోజనం)
కార్తీక మాసంలో వచ్చే భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగినీ అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం భగినీ హస్త భోజనం అంటారు. అన్నా లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని నమ్మకం. సూర్యభగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. ఆమె తన సోదరుని కార్తీక శుక్ల విదియరోజున తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. దాంతో యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా ఆహ్వానించింది. వెళ్లితీరాలి అని ఎంతో సంతోషంగా భోజనానికి వెళ్లాడు యముడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి తల స్నానం చేయించి..కొత్త బట్టలు ధరింపజేసి..నుదుటిన తిలకం దిద్ది, స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో వడ్డించింది. సంతోషంతో యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించాలని కోరింది యమున. అంతేకాదు కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే మగవారు ..తమ సోదరి ఇంటికి వెళ్ళ భోజనం చేయాలని..ఆ సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. సోదరి కోరికకు యముడు సంతోషించాడు. ఈ వేడుక జరుపుకున్న వారు అకాల మరణం లేకుండా వుంటుందని..ఆ సోదరి సౌభాగ్యవతిగా వుంటుంది అని వరాలిచ్చాడట.  అప్పటి నుంచి సోదరీ, సోదరుల అప్యాయతకు అనుబంధంగా భగనీ హస్త భోజనం పండుగను జరుపుకుంటారు.