Headaches : పిల్లల్లో తలనొప్పి ఎప్పుడు ప్రమాదకరమో తెలుసా?
తలనొప్పితో తూలిపోవటం, శరీరం బలహీనంగా మారటం, నడవలేని పరిస్ధితి, వాంతులు, ప్రవర్తనలో తేడా, కంటికి ఒక వస్తువు రెండుగా కనిపించటం వంటి సందర్భంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు.

Side view of tired girl sitting on sofa at home
Headaches : ఆడుతు,పాడుతూ ఉల్లాసంగా తిరిగే వయసులో చిన్నారుల్లో అకస్మాత్తుగా తలనొప్పి ముంచుకొస్తుంది. ఆసందర్భంలో చిన్నారులు పడే బాధవర్ణనాతీతంగా ఉంటుంది. అసలు సమస్య ఏంటో అర్ధంకాక తల్లి దండ్రులు తల్లడిల్లుతుంటారు. చాలా సందర్భాల్లో ఇది సాధారణమైన తలనొప్పి కావచ్చు. అయితే అది దీర్ఘకాలంగా కొనసాగవచ్చు. కొంతమందిలో మాత్రం అకస్మాత్తుగా తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
జలుబు చేసిననప్పుడో, రాత్రి సరిగా నిద్రపోనప్పుడే తలనొప్పి రావటం అన్నది సహజమే. యుక్త వయస్సులో ఉన్న ఆడపిల్లల్లో ఈ తలనొప్పి కనిపిస్తుంది. ఇలా వచ్చే నొప్పి దానంతట అదే తగ్గుతుంది. దీని వల్ల పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కొంత మందిలో మాత్రం అకస్మాత్తుగా తలనొప్పి మొదలవుతుంది. రక్తనాళాలు చిట్లి రక్తం స్రావం కావటం, మెదడు పొరల్లో ఇన్ ఫెక్షన్ , మెదడులో కణితి, అధిక రక్తపోటు వంటివి తలనొప్పికి దారి తీస్తాయి. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
తలనొప్పితో తూలిపోవటం, శరీరం బలహీనంగా మారటం, నడవలేని పరిస్ధితి, వాంతులు, ప్రవర్తనలో తేడా, కంటికి ఒక వస్తువు రెండుగా కనిపించటం వంటి సందర్భంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. రెండు మూడు రోజులపాటు తలనొప్పి ఉండటం, దగ్గినా, మలవిసర్జన సందర్భంలో చూపు మందగిస్తున్నా సమస్యను తీవ్రంగా భావించాలి. మెదడులోపల కణితులు, ద్రవం పోగుపడటం , రక్తనాళల లోపాలకు ఇవే సంకేతాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సందర్భంలో పిల్లలు పడటం వల్ల తలకు బలమైన గాయాలు అవుతుంటాయి. ఆసందర్భంలో వాంతలు వంటివి అవుతుంటే మాత్ర సమస్య తీవ్రమైనదిగా భావించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి మెదడుకు సంబంధించి స్కానింగ్ తీసుకుని సమస్యను ధృవీకరించుకోవాలి. సర్వసాధారణంగా చిన్నారుల్లో ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. ఇలాంటి సందర్భంలో వైద్యులతో తగిన కౌన్సిలింగ్ ఇప్పించటంతోపాటు ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేయటం ద్వారా సమస్య ను దూరం చేయవచ్చు.