Headache : వ్యాయామం తరువాత తలనొప్పి వస్తుందా! అలా ఎందుకు జరుగుతుందంటే?

వ్యాయామానికి ముందు ఏమీ తినకపోతే,రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే కేలరీల కొరత కారణంగా తలనొప్పికి కారణమవుతుంది.

Headache : వ్యాయామం తరువాత తలనొప్పి వస్తుందా! అలా ఎందుకు జరుగుతుందంటే?

Headache

Updated On : April 29, 2022 / 4:20 PM IST

Headache : శరీర ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. ఒక వ్యక్తి రోజులో కనీసం అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంత మందిలో వ్యాయామం తలనొప్పికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్ధితితో చాలా మంది రోజు వారి వ్యాయామాలకు దూరమౌతున్నారు. వాస్తవానికి వ్యాయామం తరువాత తలనొప్పి రావటం అన్నది వ్యాయామాల వల్ల కాదు. శరీరంపై ప్రభావం చూపే వ్యాయామాలు చేయటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. భారీ వ్యాయామాల కారణంగా ఈ పరిస్ధితిని కొద్ది మంది ఎదుర్కొంటుంటారు. తల బరువుగా, తిరిగినట్లు గా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాస్తవానికి ఇలా జరగటం అన్నది ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ తరహా పరిస్ధితిని ఎదుర్కొన్నట్లైతే తప్పనిసరిగా వైద్యుడిని కలవటం మంచిది. వ్యాయామం తరువాత తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి.

వ్యాయామం తర్వాత మీకు తలనొప్పి ఎందుకు వస్తుంది?

తలనొప్పి అనేది మనం తరచుగా ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో ఒకటి. ఎక్కువశాతం శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోవటం, శరీరంలోపల విపరీతమైన వేడి, కండరాలపై ఒత్తిడి అనేక ఇతర కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. వ్యాయామం తర్వాత తలనొప్పికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. శ్రమతో కూడిన తలనొప్పి ; వ్యాయామం చేయడం వల్ల మాత్రమే వచ్చే సాధారణ తలనొప్పి. దీనికి ఎటువంటి అంతర్లీనమైన కారణం ఉండదు. శ్రమతో కూడిన తలనొప్పులు వచ్చిన సందర్భంలో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఈ తరహా తలనొప్పిలో తలకు రెండు వైపులా నొప్పి, తలలో పల్స్ సెన్సేషన్, నొప్పి 5 నిమిషాల నుండి 48 గంటల వరకు కొనసాగటం, మైగ్రేన్ లాంటి అనుభూతిని కలిగించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేడి వాతావరణంలో,అధిక ఎత్తులో వ్యాయామం చేయడం వల్ల ఈ తరహా తలనొప్పి వస్తుంది.

2. డీహైడ్రేషన్ తలనొప్పి ; వ్యాయామం తర్వాత తలనొప్పికి మరొక సాధారణ కారణం శరీరంలో నిర్జలీకరణం. వ్యాయామం తర్వాత తగినంత నీరు శరీరానికి అందించకపోవటం వల్ల నిర్ణలీకరణ తో తలనొప్పి వస్తుంది. నీరు,ఎలక్ట్రోలైట్స్ తగిన మోతాదులో శరీరానికి అందిచటంవల్ల హైడ్రేట్ గా ఉంచవచ్చు. చెమట పట్టినప్పుడు ఎలక్ట్రోలైట్లను కోల్పోతారు. ఆ సందర్భంలో దాహం వేస్తోంది, ముదురు పసుపు మూత్రం, సాధారణం కంటే తక్కువ మూత్రాన్ని ఉత్పత్తి, అలసటగా,నీరసంగా అనిపించటం,మైకము ,చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

3. టెన్షన్ తలనొప్పి ; ఇది మానసిక ఒత్తిడి కాదు, శారీరకమైనది. టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ బాధాకరమైన తలనొప్పికి దారి తీస్తుంది. ఈ సమయంలో తేలికపాటి నొప్పిని కలిగి ఉండటం, తలలో నొప్పి క్రమంగా మెడ , తల వెనుక నొప్పిగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

4. తక్కువ బ్లడ్ షుగర్ ; వ్యాయామానికి ముందు ఏమీ తినకపోతే,రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే కేలరీల కొరత కారణంగా తలనొప్పికి కారణమవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు కేలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి వ్యాయామానికి ముందుగానే తగినంత కార్బోహైడ్రేట్లను తీసుకోవటం మంచిది. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉండి తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు. తక్కువ రక్త చక్కెర స్ధాయిలు ఉన్న సందర్భంలో తల తిరగడం, మూర్ఛపోయినట్లు అనిపించటం, వికారం, గందరగోళం, చెమట, ఆకలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

5. మైగ్రేన్ ; వ్యాయామం తర్వాత తలనొప్పికి మైగ్రేన్ కారణం కావచ్చు. మైగ్రేన్ నొప్పి కొన్ని సమయాల్లో అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌ను నివారించడానికి వైద్యుల సూచనలు తీసుకుని మితమైన మధ్యస్థ వ్యాయామాలు చేయాలి. మితిమీరిన వ్యాయామం సైతం కొంతమందిలో మైగ్రేన్‌ను కలిగిస్తుంది. దీని ఫలితంగా వాంతులు అవ్వటం, అలసట, వికారం, తలలో నొప్పి పుడుతోంది.