Piles Problem : పైల్స్ సమస్య బాధిస్తుందా?

తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు. బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది.

Piles Problem : పైల్స్ సమస్య బాధిస్తుందా?

Piles

Updated On : February 2, 2022 / 4:08 PM IST

Piles Problem : ఆధునిక జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిలో ఒకటి మూలశంక వ్యాధి ఒకటి. దీన్ని మొలలు , పైల్స్, అర్శ మొలలు ,మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని పైల్స్ అంటారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి. పైల్స్ కు ప్రధాన కారణం జీర్ణవ్యవస్థ. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక, బయటకు విసర్జింపబడక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

పైల్స్ బారిన పడిన వారికి మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి. ఒకటే ప్రదేశంలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారిలోనే పైల్స్ అధికంగా వస్తుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. నీళ్లు అధికంగా తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గి పైల్స్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా లేని పనివేళలు, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి మూలశంక వ్యాధి వచ్చే అవకాశం అధికం. వీరు జాగ్రత్తగా ఉండాలి. చిరు తిళ్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటి బయట దొరికే తిండి తింటే శరీరంలో వేడి అధికమై పైల్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని తగ్గించడం మంచిది.

తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు. బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది. మలం వచ్చే భాగంలో మీకు కొన్ని రోజులపాటు మంట, ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం సహాయం పొందాలి.

అంజీర పండును రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం లేచి పరగడుపున అంజీర తింటే పైల్స్ సమస్య దూరమవుతుంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించండి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గి ఫైల్స్ బారిన పడకుండా చూసుకోవచ్చు.

మజ్జిగలో కొద్దిగా ఉప్పు , కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల సమస్యను కొంతమేర తగ్గించుకోవచ్చు. అల్లం, తేనె, స్వీట్ లైమ్ మరియు పుదీనాను నీళ్ళలో మిక్స్ చేసి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటీస్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాస్ వాటర్ లో వేసి తీసుకోవటం వల్ల తిన్నది జీర్ణమై మలవిసర్జన సాఫీగా ఉంటుంది.

ఉల్లిపాయ రసం మరియు పంచదార నీటిలో వేసి మిక్స్ చేసి తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేపఆకులతో తయారుచేసిన డికాషన్ లో తేనె మిక్స్ చేసి, అరకప్పు మజ్జిగలో మిక్స్ చేసి తీసుకుంటే పైల్స్ సమస్య తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. కారంగా ఉన్న ఆహారాలను సాధ్యమైనంత వరకూ తినడం తగ్గించాలి.