Ginger Packs : చర్మం, జుట్టు సౌందర్యానికి అల్లం ప్యాక్స్
మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్‌తో పాటు ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడతాయి.

Ginger Packs
Ginger Packs : ప్రతి ఇంట్లో వినియోగించే వంట పదార్ధాల్లో అల్లం కూడా ఒకటి. చిన్నచిన్న ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అల్లం వల్ల ఉపయోగాలు ప్రయోజనాలు చాలా మందికి తెలియదు. అల్లం కేవలం మన ఆరోగ్య సమస్యలకే కాదు.. అందాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. చర్మం, జుట్టు సౌందర్యానికి అల్లం చాలా బాగా తోడ్పడుతుంది.
అల్లంలో ఎన్నో రకాల ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్‌తో పాటు ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడతాయి. అల్లం చర్మంలోని టాక్సిన్లను తొలిగిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయటంతోపాటు చర్మానికి ఎన్నో పోషకాలు కూడా అందేలా చేస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి వాటివల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
జుట్టు కోసం అల్లంతో హెయిర్ ప్యాక్; జుట్టు బలంగా పెరగడంతో పాటు చుండ్రు తగ్గడానికి కూడా అల్లం ఎంతగానో తోడ్పడుతుంది. అల్లానికి జుట్టును కండిషన్ చేసే గుణాలు ఉంటాయి. నూనెలోని గుణాలు మీ జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఇందుకోసం అల్లంతో తయారు చేసుకున్న సహసిద్ధమైన హెయిర్ ప్యాక్ వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంతో హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…
అల్లంతో హెయిర్ ప్యాక్ తయారీకి సంబంధించి ముందుగా అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేకుంటే ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. అల్లాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకొని దాన్ని నూనెలో కలుపుకోవాలి. తర్వాత జుట్టును పాయలుగా చేసుకొని వేళ్ల సాయంతో కుదుళ్లకు బాగా పట్టేలా చూడాలి. తల మొత్తానికి అప్లై చేసిన తర్వాత పది నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట పాటు ఉండనివ్వాలి. ఇలా చేయటం వల్ల జుట్టుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. తర్వాత తలస్నానం చేయాలి.
చర్మ సమస్యలకోసం అల్లం ఫేస్ ప్యాక్ ; అల్లానికి చర్మ సమస్యలు తగ్గించేందుకు సహాయపడుతుంది. హైపో పిగ్మంటేషన్, నలుపు రంగు మార్క్స్‌ను తగ్గిస్తుంది. చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడతాయి. ఈ ప్యాక్ వల్ల మొటిమలతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయట. అల్లాన్ని ఫేస్ ప్యాక్‌గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
ఇందుకోసం ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ను తీసుకోవాలి. ఒక బౌల్‌లో అల్లం పేస్ట్, తేనె కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత ముఖం కడుక్కొని టోనర్ రాసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. దీంతో పాటుగా అల్లం పేస్ట్ లో కొంచెం నీళ్లు పోసి కాస్త జిగురుగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పావు గంట పాటు ఉంచుకొని కడిగేయాలి. ఇలా చేయటం వల్ల ముఖం సౌందర్యవంతంగా మారటంతోపాటు చర్మ నిగారింపును సంతరించుకుంటుంది.