దీపావళి రాకముందే : ఢిల్లీలో వాయు కాలుష్యం

దీపావళి పండుగకు ఒక రోజు ముందే..దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. వాయు కాలుష్యం అధ్వాన్నంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం అత్యల్ప గాలి నాణ్యత నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం సాయంత్రం నగరంలో గాలి నాణ్యత సూచి (AQI)311 ఉండగా..శుక్రవారం 284 నుంచి 315 మధ్య నమోదైంది. గాలి కదలికలో వేగం మందగించడంతో కాలుష్యం తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు.
నెహ్రూ నగర్, జహంగీర్ పురి, రోహిణి, వాజీర్ పూర్, అశోక్ విహార్, బావన, ముండ్కా, ఆనంద్ విహార్ ప్రాంతాల్లో కాలుష్యం అధికంగానే ఉందని తెలిపారు. ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గుర్ గావ్, నోయిడాల్లోనూ ఇలాగే ఉంది. ఢిల్లీ, శాటిలైట్ టౌన్‌లలో శనివారం నుంచి బుధవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు నిషేధం విధించింది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు, పవర్ ప్లాంటులు మూసివేయాలని సూచించింది.
ఇదిలా ఉంటే..దీపావళి పండుగ వేళ పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టపాసుల వల్ల అధికంగా కాలుష్యం వెదజల్లుతోంది. సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి భారీగా దీపావళి టపాసులు కాలుస్తుండడంతో వాతావరణం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. గ్రీన్ కాకర్స్ మాత్రమే కాల్చాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. చాలామంది రాత్రంతా టపాసులు పేల్చడంతో కాలుష్యం ప్రమాదకరస్థాయికి పడిపోతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా కాలుష్యం వెదజల్లని టపాసులు కాల్చాలని సూచిస్తున్నారు.
Read More : ఆత్మగౌరవం ఉన్న మహిళలు బీజేపీని బహిష్కరించాలి