Beetroot : బీట్ రూట్ తో మెదడు పనితీరు భేష్..

బీట్ రూట్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా వున్నాయి. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని బీట్ రూట్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది.

Beetroot : బీట్ రూట్ తో మెదడు పనితీరు భేష్..

Beetroot

Updated On : November 7, 2021 / 3:52 PM IST

Beetroot : తియ్యగా, వగరుగా ఉండే బీట్ రూట్ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు బాగా ఉపయోగపడుతుంది…బీట్ రూట్ దుంపను తినడానికి చాలా మంది అంతగా ఇష్టపడరు. కానీ బీట్ రూట్ లో ఆరోగ్యసుగుణాలు మెండుగా ఉంటాయి. బీట్ రూట్ లాంటి సహజ సిద్ధ ఆహారాన్ని పచ్చిగా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా, కూర వండుకుని తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జ్యూస్ లేదా సలాడ్ ఏదో ఒకరూపంలో ప్రతి రోజు తీసుకుంటే మంచిదని అనేక మంది డైటీషియన్లు చెప్తున్నారు.

మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్ బీట్ రూట్ లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్ రూట్ లో గ్లుటామైన్, ఎమినో యాసిడ్స్, 3.4గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్ క్యాన్సర్ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీర్ణక్రియలను మెరుగుపరుస్తాయి. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. బీట్ రూట్ లో ఉన్న నైట్రేట్స్ రక్తప్రసరణను మెరుగు పరిచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. రక్తప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపీడన నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్ ఎటాక్ వంటి సమస్యలేవి తలెత్తవు.

బీట్‌రూట్‌లోని నైట్రేట్ ముందు నైట్రైట్‌గానూ, అనంతరం నైట్రిక్ ఆక్సైడ్‌గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది అలాగే చర్మానికి కూడా బీట్ రూట్ మేలు చేస్తుంది. నాలుగు స్పూన్ల బీట్ రూట్ రసంలో నాలుగు చెంచాల పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఇరవై నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలను కూడా పూర్తిగా నివారించుకోవచ్చు.

బీట్ రూట్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా వున్నాయి. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని బీట్ రూట్ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఫలితంగా ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా పనిచేస్తుందని చెప్పవచ్చు. బీట్ రూట్ ను రోజూ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. రక్తహీనత ఉన్నవారికి బీట్ రూట్ ఒక దివ్యౌషధం. బీట్ రూట్ ను ప్రతిరోజూ తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.

విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్ , ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. బీట్ రూట్ సలాడ్ గా గానీ, జ్యూస్ లేదా బీట్ రూట్ డిప్ గాని తీసుకోవడం వల్ల దీనిలో పోషకాలన్నీ మీకు అందుతాయి.డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరంలాంటిది. బీట్ రూట్ ను జ్యూస్ రూపంలో డీ హైడ్రేషన్ బాధితులు తీసుకుంటే వారి సమస్య పరిష్కారమవుతుంది. మన శరీరానికి అవసమైన నీరు బీట్ రూట్ నుంచి దొరుకుతుంది. రోజువారి ఆహారంలో బీట్ రూట్ ను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది.