Eyesight : కంటి చూపు సమస్యలా!…ఆ విటమిన్ లోపించిందేమో చెక్ చేయండి?

ప్రకృతిలో లభించే కేరట్, క్యాబేజీ, బొప్పాయి, మునగ, పచ్చని ఆకు కూరల్లో విటమిన్ ఎ విరివిగా లభిస్తుంది. వీటిలో ఉండే బీటాకెరోటిన్ ద్వారా విటమిన్ ఎ అందుతుంది.

Eyesight : కంటి చూపు సమస్యలా!…ఆ విటమిన్ లోపించిందేమో చెక్ చేయండి?

Eyes

Updated On : February 18, 2022 / 6:15 PM IST

Eyesight : ఇటీవలి కాలంలో కంటి చూపు సమస్యలు చాలా మందిని బాధిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. టెక్నాలజీ పెరగటంతో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం అధికం కావటం, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, కళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవటంతో కంటి చూపు సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. చాలా మందిలో కళ్ల నొప్పులు, దురదలు, మసకగా కనిపించటం, చూపు మందగించటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది కంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. చిన్న వ‌య‌స్సులోనే అద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి వస్తుంది. ముఖ్యంగా దీనికి కారణాలు లేకపోలేదు. తీసుకునే ఆహారాల్లో కంటికి మేలు చేసే ఆహారాలను తీసుకోవటం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ లోపం కారణంగానే వివిధ రకాల కంటి జబ్బులు వస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రకృతిలో లభించే కేరట్, క్యాబేజీ, బొప్పాయి, మునగ, పచ్చని ఆకు కూరల్లో విటమిన్ ఎ విరివిగా లభిస్తుంది. వీటిలో ఉండే బీటాకెరోటిన్ ద్వారా విటమిన్ ఎ అందుతుంది. పాలు, వెన్న, గుడ్లు, చేపల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ లోపిస్తే మనిషి శరీరంలో ముఖ్యంగా దాని ప్రభావం కళ్లపై నే పడుతుంది.

విటమిన్ ఎ లోపం వల్ల కంటిలో తెల్లగుడ్డు ఎండిపోయినట్లు కనిపిస్తుంది. నల్ల గుడ్డు ప్రకాశం కోల్పోతుంది. నల్ల గుడ్డు ద్వారా కాంతి కిరణాలు రెటీనాకు స్పష్టంగా చేరవు. తద్వారా కళ్లల్లో దురదలు, సరిగ్గా చూడలేని పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్ ఎ లోపించిన వారిలో గాయాలు త్వరగా మానకపోవటంతోపాటుగా, దంతాలు రావటంలోను లోపాలు చవిచూడాల్సి వస్తుంది. అంతేకాకుండా కంటిలోని రోడోప్సిస్ అనే పదార్ధం తగ్గడం వల్ల రేచీకటి వచ్చే అవకాశం ఉంటుంది.