మట్టిలో మాణిక్యాలు.. మురికివాడ నుంచి పుట్టుకొస్తున్న రాక్‌స్టార్స్‌ 

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 12:13 PM IST
మట్టిలో మాణిక్యాలు.. మురికివాడ నుంచి పుట్టుకొస్తున్న రాక్‌స్టార్స్‌ 

Updated On : April 4, 2020 / 12:13 PM IST

ధారావిలో చెత్త ఏరుకొనే పిల్లలు రాక్‌ బ్యాండ్‌తో పాపులర్‌ అయ్యారు. చదువుకొనేందుకు ఆసక్తి చూపించని ఇక్కడి పిల్లలు ఏం చేస్తుంటారు? ధారవి బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రూపొందడం వెనుక కారణాలున్నాయా? అక్కడి ప్రజల జీవన శైలి ఎలా ఉంటుంది? ఈ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి మొదలైతే అదుపు చేయడం అంత సులువు కాదు. మరి బృహన్‌ ముంబై నగర పాలక సంస్థ ఏం చేస్తోంది? 

అకార్న్ ఫౌండేషన్.. స్లమ్ రాక్ స్టార్స్ :
ముంబై మహానగరం నడిబొడ్డున ఉన్న ఈ మురికివాడ ఇప్పుడు దేశం గర్వించదగిన రాక్ స్టార్లను తయారుచేస్తోంది. అకార్న్ పేరుతో ఇక్కడ నడిచే ఓ ఫౌండేషన్.. ఈ స్లమ్ రాక్ స్టార్స్ అద్భుత ప్రతిభకు వేదికైంది. పనికి రావని పక్కన పడేసిన ప్లాస్టిక్ బ్యారెల్స్, డబ్బాలు, పెయింట్ క్యాన్లే వారి సంగీత వాయిద్యాలు. వాటితోనే అదిరిపోయే విన్యాసాలు చేస్తున్నారు. వినోద్ శెట్టి అనే వ్యక్తి ఈ ఫౌండేషన్‌కు ఊపిరిపోశాడు.

అభిజిత్ జేజురికర్ ఇక్కడి పిల్లల్లోని ప్రతిభను వెలికితీసి, దానికి సానబెట్టి వాళ్లను స్టార్లను చేశాడు. పనికి రాని వస్తువులను సంగీత వాయిద్యాలుగా చేయడమే కాదు.. చిత్తు కాగితాలు ఏరుకొనేవారిని, ఫ్యాక్టరీలు, ఇళ్లలో పని చేసే పిల్లలను రాక్ స్టార్లుగా మలిచిన ఘనత ఆయన సొంతం. ధారావి రాక్స్ అంటూ వంద మంది అలాంటి పిల్లలకు సమాజంలో ఓ స్టేటస్ ఇచ్చాడు. 

వీరు పాడితే.. అమితాబ్ మంత్రముగ్ధుడై చూస్తారు :
ఇటీవల కాలంలో దేశమంతా ధారావి పేరు మారుమోగిపోయింది. చిత్తుకాగితాలు ఏరుకొనే పిల్లలే దీనికి కారణమంటే నమ్మాలనిపించదు. కానీ, అది నిజం. వారంతా మురికివాడల్లో చిత్తుకాగితాలు ఏరుకొనే పిల్లలు. కానీ వాళ్లు పాడితే బిగ్ బీ అమితాబ్ కూడా మంత్రముగ్ధుడై చూస్తారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ వారితో కలిసి స్టెప్పులేస్తారు.

అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే, జర్మన్ స్కూల్ లాంటి ప్రముఖ పాఠశాలలు కూడా ఈ చదువు రాని పిల్లలతో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇప్పించాయి. వాళ్ల కథ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. అది రీల్ స్టోరీ అయితే ఇది రియల్ స్టోరీ. ఈ మట్టిలో మాణిక్యాలను వెతికిపట్టుకొని రియల్ హీరోలుగా తయారుచేసిన వ్యక్తి అభిజిత్ జేజురికర్.

రజనీ ‘కాలా’ ధారవి నేపథ్యంలోనేదే :
ఇక ధారవి బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలు కూడా చాలానే వచ్చాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా..ధారవి నేపథ్యంలో తీసిందే. పొట్ట చేత పట్టుకుని ముంబై వచ్చిన తమిళ ప్రజల జీవితాల ఆధారంగా ఈ సినిమా తీశారు. మురికివాడల్లో బతికేవారు ప్రతిరోజూ ఎదుర్కొనే సమస్యలను డై రెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు.

1987లో విడుదలైన మణిరత్నం, కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లోని నాయకుడు కూడా ధారావి నేపథ్యంలో వచ్చిందే. 2008లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ కూడా ఇదే నేపథ్యంలో తీశారు. మురికివాడల్లో చిన్నారుల జీవనం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.