Heart Disease : గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకునే మార్గాలు!

రోజువారి వ్యాయామం గుండె జబ్బులు దరిచేరకుండా చూడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. వ్యాయామాన్ని ఒక దిన చర్యగా కొనసాగించటం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది.

Heart Disease : గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకునే మార్గాలు!

Heart Health

Updated On : April 11, 2022 / 3:12 PM IST

Heart Disease : మనిషి శరీరంలో కీలకమైనది గుండె. గుండె పదికాలలపాటు పదిలంగా ఉండాలంటే జాగ్రతలు పాటించటం మంచిది. గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇటీవలి కాలంలో గుండె జబ్బుల సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో గుండె ఆరోగ్యం విషయంలో కొన్ని మార్గాలను అనుసరించటం మంచిది. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గుండెకు నడక ; కేవలం 40 నిమిషాలు వారంలో నాలుగు సార్లు వాకింగ్ లేదా, జాగింగ్ వంటివి చేయటం వల్ల గుండెకు మంచి మేలు కలుగుతుంది. ఇలా చేయటం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఈ వ్యాయమాలు ఒకేసారి చేయవలసిన అవసరం లేదు. ఒక్కోసారి 10 నిమిషాలు చేసినా హృదయానికి చాలా మంచిది. ఇంట్లో ఉండే కుక్కను తీసుకుని 10నిమిషాలు అటు ఇటు నడిచినా లేదంటే పార్క్ కు స్నేహితుడిని కలిసేందుకు నడుచుకుంటూ వెళ్ళినా సరిపోతుంది. జాగింగ్ వంటివి చేసే ముందు వైద్యుని సంప్రదించి ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవటం మంచిది.

స్నేహితులతో కలిసి సరదగా గడపండి ; స్నేహితులతో కలసి సరదాగా భోజనం చేసేందుకు వెళ్ళండి. వారితో అనందంగా మాటలు పంచుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఒంటరిగా ఉండటం వల్ల గుండెకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగని స్నేహితులతో కలసి మద్యం సేవనం, ధూమపానం వంటివి చేయటం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహితులతో కలసి మంచి విషయాలను పంచుకునేందుకు , కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించటం ద్వారా ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఎక్కువ పండ్లు , కూరగాయలు తినండి ; పోషకాలు,ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి మధుమేహం, గుండె జబ్బులకు దారితీసే పరిస్ధితి నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఆహారంలో వివిధ రంగుల పండ్లు , కూరగాయలను తీసుకునేందుకు ప్రయత్నించండి.

గింజలతో కూడిన చిరుతిండి ; నట్స్‌లోని ఫైబర్, అసంతృప్త కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో సహాయపడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూస్తాయి. స్ట్రోక్‌లకు కారణమయ్యే రక్తం గడ్డకట్టకుండా కూడా రక్షించుకోవచ్చు. అయితే నట్స్ ను అతిగా మాత్రం తీసుకోవద్దు. వీటిలో అత్యధిక కేలరీలు ఉంటాయి. ఉప్పులేని గింజలను తినటం అలవాటు చేసుకోండి.

సాల్మన్‌ చేపలు ; సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ , ట్యూనా వంటి కొవ్వు చేపలను వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతోపాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఈ చేపలలో రసాయనాలు , యాంటీబయాటిక్స్ వంటి కలుషితాలు తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.

వ్యాయామాన్ని దినచర్యగా చేసుకోవటం ; రోజువారి వ్యాయామం గుండె జబ్బులు దరిచేరకుండా చూడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. వ్యాయామాన్ని ఒక దిన చర్యగా కొనసాగించటం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. తోటపని, ఇంటి పని, పిల్లలతో ఆడుకోవటం, ఇంటిని శుభ్రం చేసుకోవటం వంటివి చేయటం ఉత్తమం. ఇలా చేయటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

యోగా చేయటం మంచిదే ; యోగా అనేది వ్యాయామం మాత్రమే కాదు, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ,ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది హృదయ స్పందన రేటు , రక్తపోటును తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేస్తుంది. ఇది గుండెకు మంచిది. యోగా చేయలేకపోతే ధ్యానం, సంగీతం వినడం , ఆనందించే అభిరుచి వంటి ఇతర ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించటం మంచిది.

కనీసం 7 గంటలు నిద్రపోండి ; శరీరానికి విశ్రాంతి అవసరం. లేకపోతే హృదయ స్పందన రేటు,రక్తపోటు పడిపోతాయి. గుండె ఆరోగ్యానికి కీలకం. 7 గంటల కంటే తక్కువసేపు నిద్రపోతే దాని ప్రభావం శరీరం మొత్తంపై పడుతుంది. తక్కువ సమయం నిద్ర గుండెకు చేటు కలిగిస్తుంది.

స్లీప్ అప్నియా ఉందో లేదో తెలుసుకోండి ; బిగ్గరగా గురక పెట్టటం, ఊపిరి పీల్చుకుంటూ మేల్కోవటం, రాత్రి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా రోజంతా అలసిపోవటం గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించటం మర్చిపోకండి. అవి స్లీప్ అప్నియా సంకేతాలు. దీని వల్ల స్ట్రోక్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగా అప్రమత్తం అయితే గుండెను కాపాడుకోవచ్చు.

దూమపానం వదిలేయండి ; ధూమపానం రక్తపోటును పెంచుతుంది, దీని వల్ల వ్యాయామం చేయడం కష్టతరంగా మారుతుంది. రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది, ఇది చిరకు స్ట్రోక్‌కు కారణమవుతుంది. కాబట్టి దూమపానం అలవాటు ఉంటే మానుకోవటం మంచిది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనండి ; నెలకు ఒకసారి కంటే, వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. సెక్స్ కూడా గుండెను రక్షించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొనవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకే ప్రదేశంలో అధికసమయం కూర్చోవద్దు ; రోజంతా కూర్చుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా తక్కువ కేలరీలను బర్న్అవుతాయి. ఇది శరీరంలో చక్కెర , కొవ్వును ప్రాసెస్ చేసే విధానం మారే అవకాశాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి. పని ప్రదేశంలో, ఇంట్లో ఎక్కువసేపు కూర్చోవటం మంచిదికాదు. గంటకు ఒకసారైనా కొద్ది సమయం అటు ఇటు తిరిగేందుకు ప్రయత్నించండి.

రెగ్యులర్ చెకప్‌లు; రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె, రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదంలో ఉన్నాయో లేదో వైద్యులు వివిధ పరీక్షలు చేయటం ద్వారా తెలుసుకుంటారు. ఆ సమస్యలను ఎంత త్వరగా గుర్తిస్తే వాటికి త్వరగా చికిత్స చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా గుండెను రక్షించుకోవడానికి జీవనశైలిలో మార్పులు ,మందులను వైద్యులు సూచిస్తారు..