Malkajgiri Lok Sabha Constituency : దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరిలో ఆధిపత్యమెవరిది?

మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్ గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.

Malkajgiri Lok Sabha Constituency : దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరిలో ఆధిపత్యమెవరిది?

Big Fight In Malkajgiri Lok Sabha Constituency

Malkajgiri Lok Sabha Constituency : మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ తో పాటు, బీజేపీ, బీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇంతకీ మల్కాజిగిరిలో పార్టీల బలాబలాలేంటి? అభ్యర్థుల గెలుపు అవకాశాలేంటి ?

మినీ భారత్, తెలంగాణకు గుండె..
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం.. ఓట్లపరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఇంకా చెప్పాలంటే అదో మినీ భారత్.. దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ఓటర్లు మల్కాజిగిరి పార్లమెంటులో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన ఈ పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతోపాటు పారిశ్రామిక, విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక యూనిర్శిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం.

ఇంతవరకు బోణీకొట్టని బీఆర్ఎస్, బీజేపీ..
హైదరాబాద్ నగరానికి తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును సెంటిమెంట్ గా భావిస్తుంటారు నేతలు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇఫ్పటివరకు బీఆర్ఎస్, బీజేపీలు బోణీ కొట్టనేలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ గెలుపొందాయి. ఈసారి మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి.

3 ఎన్నికల్లో 2సార్లు కాంగ్రెస్ కే పట్టం..
మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం.. గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈసారి మల్కాజ్ గిరి నుంచి ఎట్టి పరిస్థితిలో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది.

సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గట్టి పట్టున్న మాజీమంత్రి పట్నం మహేందర్రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. మల్కాజిగిరిలో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడెంచల విధానంతో గెలుపుబావుట ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇంఛార్జిగా నియమించింది.

కాంగ్రెస్ ముందు బిగ్ ఛాలెంజ్..
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీలలో ఒక్కటీ గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. అదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద మైనస్ గా చెబుతున్నారు పరిశీలకులు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా.. ఈ నియోజకవర్గం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవకపోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించడం కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా చెబుతున్నారు. దీంతో మల్కాజిగిరిలో గెలుపు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. ముఖ్యంగా అభ్యర్థి ఎంపికలోనూ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

కాంగ్రెస్ కు నాన్ లోకల్ టెన్షన్..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి ఉన్న పలుకుబడి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేవెళ్ల నుంచి పోటీ చేయించాలని భావించిన సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరికి మార్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు సవరించికుంటూ, లోటు పాట్లను సరి చేసుకొని విజయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. అందుకోసం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్చుకుంటోంది కాంగ్రెస్. మల్కాజిగిరిలో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం చేస్తోంది. అయితే నియోజకవర్గానికి స్థానికురాలు కాదనే ప్రచారం సునీతా మహేందర్ రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది.

లోకల్.. నాన్ లోకల్ నినాదం అందుకున్న బీఆర్ఎస్..
ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా మల్కాజిగిరిపై పెద్ద స్కెచ్చే వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ… మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి స్థానిక నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్థానికేతర నేతలని.. తాను లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు లక్ష్మారెడ్డి. అయితే రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కూడా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. కానీ, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మాత్రం మల్కాజ్ గిరిపై ఆశలు పెంచుకుంటూనే ఉంది.

గులాబీ నేతల్లో కలవరం..
అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 9.5 లక్షల ఓట్లు సాధించిన కారు పార్టీ… అవే ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి బీఆర్ఎస్ కు మూడున్నర లక్షల మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా ఉండటంతో గెలిచి తీరాలని పట్టుదల ప్రదర్శిస్తోంది బీఆర్ఎస్. మల్కాజ్ గిరిలో గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా? అనే అనుమానం గులాబీ పార్టీ నేతలను వెంటాడుతోంది. అధికారం కోల్పోవడంతో క్యాడర్ లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అయితే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం అలాగే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవడం ఖాయమని చెబుతున్నారు గులాబీ నేతలు.

బీజేపీ భారీ వ్యూహం..
ఇక బీజేపీ కూడా మల్కాజ్ గిరి కైవసం చేసుకోవాలని భారీ వ్యూహం పన్నుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న బీజేపీ.. ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారత దేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేసింది. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే.. రాష్ట్రంలో కీలకపాత్ర పోషించవచ్చని భావిస్తోంది బీజేపీ. మల్కాజ్ గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే.. తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది. అందుకే పార్టీలో ప్రధాన నేతగా మారిన ఈటల రాజేందర్ ను మల్కాజిగిరి బరిలోకి దింపింది. ఇప్పటివరకు మల్కాజ్ గిరిపై కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి కచ్చితంగా గెలిచితీరాలనే కసితో పనిచేస్తున్నారు బీజేపీ నేతలు.

అదే.. బీజేపీకి బిగ్ మైనస్..
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోవడంతో బీజేపీకి మైనస్ గా చెబుతున్నారు పరిశీలకులు. నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించకపోవడంతో… ఎక్కడో చిన్న అనుమానం రేకెత్తుతోంది. గత మూడు ఎన్నికల్లోనూ నిరాశజనక ఫలితాలే మూటగట్టుకుంది బీజేపీ. అయితే ఈ సారి మాత్రం ప్రధాని మోదీ మేనియా.. పాజిటివ్ టాక్ ద్వారా ఎట్టి పరిస్థితిలో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తున్నారు బీజేపీ నేతలు.

ఓటర్లు పట్టం కట్టేది ఎవరికో?
ఇలా కీలకమైన మల్కాజిగిరి స్థానం కోసం మూడు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్.. తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని చూస్తుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇక కాషాయదళం కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్ గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.

Also Read : మూడు పార్టీలకు సవాల్‌గా మారిన ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు.. నాలుగో అభ్యర్థిగా బరిలోకి లంబాడా నేత!