2023 Small Movies : కంటెంట్ ఉంటే చాలు స్టార్స్ అక్కర్లేదు.. 2023లో సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలు ఇవే..

2023లో స్మాల్ బడ్జెట్ తో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆడియన్స్ ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాయి.

2023 Small Movies : కంటెంట్ ఉంటే చాలు స్టార్స్ అక్కర్లేదు.. 2023లో సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలు ఇవే..

2023 Small Movies with Biggest Hits and Profits Full List Here

Updated On : December 31, 2023 / 11:44 AM IST

2023 Small Movies Big Hits : భారీ బడ్జెట్.. భారీ క్యాస్టింగ్.. భారీ లోకేషన్లు.. భారీ ఫైట్లు.. భారీ సెట్టింగులు.. స్టార్ నటులు.. ఇలా భారీగా ఏం లేకపోయినా.. అస్సలు వర్రీలేకుండా హిట్టయ్యాయి చిన్న సినిమాలు. కంటెంట్ ఉంటే చాలు స్టార్స్ తో పనిలేకుండా హిట్ కొట్టొచ్చు అని నిరూపించాయి. 2023లో స్మాల్ బడ్జెట్ తో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆడియన్స్ ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాయి. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కొన్ని చిన్న సినిమాలు సర్‌ప్రైజ్ చేశాయి. మొత్తానికి 2023లో చిన్న సినిమాల హవా గట్టిగానే నడిచింది.

జనవరిలో సంక్రాంతికి అన్ని పెద్ద సినిమాలు రావడంతో చిన్న సినిమాలు ఎక్కువగా రాలేదు. వచ్చినా ప్రేక్షకులని మెప్పించలేదు.

ఫిబ్రవరిలో వచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’ తో స్మాల్ మూవీస్ మెరుపులు స్టార్ట్ అయ్యాయి. కొత్త డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో కలర్ ఫోటోతో సక్సెస్ కొట్టిన సుహాస్ హీరోగా అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కేవలం 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 10 కోట్లకు పైగా కలెక్టు చేసింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కూడా పర్వాలేదనిపించి ప్రాఫిట్స్ మిగుల్చుకుంది.

మార్చిలో వచ్చిన మరో చిన్న సినిమా ‘బలగం’. తెలంగాణ పల్లెలన్నింటినీ ఏకం చేసింది బలగం సినిమా. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీసు వద్ద బలంగా నిలబడింది. కేవలం 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్లకు పైగా కలెక్టు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. 2023లో తెలంగాణ పల్లెలు.. పట్టణాల్లో ఎక్కువగా వినిపించిన సినిమా పేరు ఏదంటే.. బలగం అని చెప్పుకోవచ్చు.

ఏప్రిల్ లో చిన్న సినిమాలు చాలానే వచ్చినా థియేటర్స్ వద్ద నిలబడలేకపోయాయి.

Also Read : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ముగ్గురు హీరోల స్టెప్పులు చూశారా?

మే చివర్లో ‘మేము ఫేమస్’ అనే చిన్న సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ పల్లెల్లో ఉండే యూత్ ఆధారంగా తెరకెక్కింది. రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి లాభాలు తెచ్చుకుంది.

జూన్ మొదట్లో తిరువీర్ హీరోగా వచ్చిన తెలంగాణ నేటివిటీ సినిమా ‘పరేషాన్’ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత జూన్ చివర్లో వచ్చిన మరో స్మాల్ మూవీ.. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఇయర్ మిడిల్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులని కితకితలు పెట్టింది. గల్లాపెట్టెను కూడా గట్టిగానే గలగలమనిపించింది. దాదాపు 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అదరగొట్టి ఫుల్ ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది.

2023లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మరో స్మాల్ మూవీ ‘బేబీ’. జులైలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన బేబీ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముఖ్య పాత్రల్లో లవ్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కిన బేబీని దాదాపు 10 కోట్లతో నిర్మించగా ఏకంగా 90 కోట్లదాకా వసూల్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2023లో చిన్న సినిమాల్లో ఎక్కువ వసూళ్ళు సాధించిన మూవీ బేబీనే.

ఆగస్టులో సోహైల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రగ్నెంట్’, కార్తికేయ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమాలు మినిమమ్ లాభాలతో మంచి విజయాలు సాధించాయి.

సెప్టెంబర్ లో కూడా చిన్న సినిమాలు చాలానే వచ్చినా థియేటర్స్ లో ఏవి మెప్పించలేకపోయాయి.

Also Read : Venky 75 Event : వెంకీ మామ 75 సినిమాల సెలబ్రేషన్స్ ప్రోమో చూశారా? ఫుల్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

అక్టోబర్ లో కొత్తవాళ్లతో వచ్చిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాలేజీ, యూత్ సబ్జెక్టుతో వచ్చి ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించిన ఈ సినిమా దాదాపు 5 కోట్లతో తెరకెక్కగా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి మంచి విజయం సాధించింది.

నవంబర్ లో కీడా కోలా, మా ఊరి పొలిమేర 2, మంగళవారం సినిమాలు మంచి విజయాలు నమోదు చేశాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 3 కోట్లతో తెరకెక్కిన కీడాకోలా సినిమా కామెడీతో ప్రేక్షకులని మెప్పించి 10 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా 3 కోట్లతో తెరకెక్కగా 20 కోట్ల వరకు కలెక్ట్ చేసి మంచి విజయం సాధించింది. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన మంగళవారం సినిమా 5 కోట్లతో తెరకెక్కించగా దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసి మంచి విజయం సాధించింది.

డిసెంబర్ లో కూడా చిన్న సినిమాలు పలు రిలీజయినా ఓ రేంజ్ విజయాలు అంతగా నమోదు అవ్వలేదు. మొత్తంగా ఈ సంవత్సరం స్టార్స్ తో పాటు చిన్న సినిమాలు కూడా చాలా రాగా కంటెంట్ తో మెప్పించి పలు చిన్న సినిమాలు మంచి విజయాలు సాధించి ప్రాఫిట్స్ తెచ్చుకున్నాయి.