చరిత్రను వక్రీకరించొద్దు : ‘ఆర్ఆర్ఆర్’పై అల్లూరి యువజన సంఘం అభ్యంతరం
‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని, చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని, చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు..
‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాల తర్వాత.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ ‘కొమురం భీమ్’గా, చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా కనిపించనున్న సంగతి తెలిసిందే.. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ సినిమాపై అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరించడం దర్శకుడు రాజమౌళికి తగదని వీరభద్రరావు అన్నారు.
అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం జిల్లాలోని పాండ్రంకిలో పుట్టి.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న బ్రిటీషు సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందారని, కొమురం భీమ్ 1901లో జన్మించి, 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు వివరించారు. వీరిద్దరికీ ఎలా స్నేహం ఏర్పడింది అనేది చరిత్రలో ఎక్కడా లేదని, కాబట్టి చరిత్రలో లేని విషయాలతో చరిత్రను వక్రీకరించడం మంచిది కాదని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించకుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం ఇచ్చారు. నర్సీపట్నంతో అల్లూరికి వీడదీయలేని అనుబంధం ఉందని, భవిష్యత్తులో అల్లూరి జిల్లా ఏర్పాటు చేస్తే నర్సీపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు.
Read Also : మరోసారి మానవత్వం చాటుకున్న ‘తలైవా’
‘ఆర్ఆర్ఆర్’ కథ పూర్తిగా కల్పితమేనని రాజమౌళి గతంలో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. 1920 కాలంలో అల్లూరి, కొమురం భీమ్ ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారనేది చరిత్రలో నమోదు కాలేదని, ఒకవేళ ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉంటే కనుక ఎలా ఉండేదనేదాన్ని ఊహించి ఈ కథను తయారు చేశామని రాజమౌళి చెప్పారు. అలియా భట్ కథానాయికగా నటిస్తుండగా, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు..