AM Rathnam : పవన్ కళ్యాణ్ తో నా అనుబంధం 25 ఏళ్ళు.. హరి హర వీరమల్లు సినిమా గురించి నిర్మాత కామెంట్స్..

నేడు నిర్మాత ఎఎం. రత్నం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు.

AM Rathnam : పవన్ కళ్యాణ్ తో నా అనుబంధం 25 ఏళ్ళు.. హరి హర వీరమల్లు సినిమా గురించి నిర్మాత కామెంట్స్..

AM Rathnam

Updated On : July 19, 2025 / 5:22 PM IST

AM Rathnam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతుంది. నిర్మాత ఎఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో ఎఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పెరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు నిర్మాత ఎఎం. రత్నం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు.

హరి హర వీరమల్లు సినిమా గురించి నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. 17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము. మొదట రెండు భాగాలని అనుకోలేదు. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే ఎక్కువమందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగి రెండు భాగాలూ అనుకున్నాము అని తెలిపారు.

Also Read : Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4.. హైదరాబాద్ లో ఆడిషన్స్.. ఎప్పుడు? ఎక్కడ?

హరి హర వీరమల్లు సినిమా ప్రయాణం గురించి చెప్తూ.. భారతీయుడుతో సహా చాలా భారీ సినిమాలు చేశాను. కానీ నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి కరోనా, పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు, ఎన్నికలు.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి డేట్స్ ఇచ్చినంత మాత్రాన పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే బాగా ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి అని తెలిపారు.

AM Rathnam

పవన్ కళ్యాణ్ గారితో అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో సినిమా. మధ్యలో సత్యాగ్రహి అనుకున్నాం కానీ అది ఆగిపోయింది. పేరుకి మూడు సినిమాలే అయినా మా మధ్య 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సినిమా లవ్ స్టోరీ అయినా ఓ సీన్ లో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు ఆయనే చెప్పారు. ఆ సినిమాలో ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. అలా ఆయన సినిమాల్లో ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తుంటారు అని అన్నారు. అలాగే ఆయన ఇప్పుడు నేషనల్ నాయకుడిగా ఎదిగారు. దాన్ని మేము బాధ్యతగా భావించి మరింత శ్రద్ధగా సినిమాని తీసాం. సినిమా ఆలస్యమైనా పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. నేనంటే కూడా ఆయనకి ఇష్టం అని అన్నారు.

Also Read : Sudheer – Pradeep : చాన్నాళ్లకు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న సుధీర్ – ప్రదీప్.. ప్రోమో వైరల్..

దర్శకుడు జ్యోతికృష్ణ గురించి మాట్లాడుతూ.. మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా ఇండియన్ జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు అని తెలిపారు.